తెలంగాణలోని 17 సెగ్మెంట్లకు 1400 నామినేషన్లు

by GSrikanth |
తెలంగాణలోని 17 సెగ్మెంట్లకు 1400 నామినేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం రూపొందించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 18న నోటిఫికేషన్ రీలీజ్‌తో పాటే నామినేషన్లు మొదలయ్యాయి. వారం రోజుల వ్యవధిలో మొత్తం నామినేషన్ల సంఖ్య 1400 దాటింది. కొద్దిమంది నాలుగు సెట్ల చొప్పున దాఖలు చేయగా మరికొద్దిమంది రెండు చొప్పున సమర్పించారు. ఆరు రోజుల్లో 645 మంది 856 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా చివరి రోజున భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. వీటిని ప్రాథమిక స్థాయిలో పరిశీలించి అర్హత కలిగినవాటిని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పట్టనున్నందున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సమగ్రమైన జాబితాను మీడియాకు విడుదల చేయలేకపోయింది. రాత్రి పది గంటల సమయానికే 1400కు పైగా నామినేషన్లు వచ్చినట్లు తేలింది.

రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా మాత్రమే కాక అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరిలో గరిష్ట స్థాయిలో 170కు పైగా నామినేషన్లు వచ్చాయి. అతి తక్కువగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 30లోపు నామినేషన్లు దాఖలయ్యాయి. మల్కాజిగిరితో పాటు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి తదితర నియోజకవర్గాల్లో ట్రిపుల్ డిజిట్‌లో నామినేషన్లు వచ్చాయి. షెడ్యూలు ప్రకారం ఎలాగూ శుక్రవారం స్క్రూటినీ కార్యక్రమం ఉన్నందున నిబంధనలకు లోబడి ఉన్నవెన్ని?... తిరస్కరణకు గురయ్యేవి ఎన్ని?... అనే స్పష్టత రానున్నది. సగటున ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి 80కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులవారీగా చూస్తే దాదాపు 900 మందిగా తేలే అవకాశమున్నది.

నామినేషన్లను ఉపసంహరించుకోడానికి ఈ నెల 29 వరకు గడువు ఉన్నందున అప్పటికి ఎంత మంది విత్ డ్రా అవుతారనేది ఆసక్తికరం. కొన్ని చోట్ల ఒకే పార్టీకి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ ఒక్కరికే పార్టీ బీ-ఫామ్ ఇచ్చినందున డమ్మీలుగా దాఖలైన నామినేషన్లన్నీ స్క్రూటినీ ప్రాసెస్ తర్వాత ఉపసంహరణకు గురయ్యే అవకాశమున్నది. కొద్దిమంది పలు సెట్ల నామినేషన్లు వేసినందున అవి కూడా కొలిక్కి రానున్నాయి. నామినేషన్లను ఉపసంహరించుకున్న తర్వాత ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనే అంశంపై క్లారిటీ రానున్నది. ప్రతీ ఈవీఎంకు 16 మంది పేర్ల చొప్పున గరిష్టంగా ఒక కంట్రోల్ యూనిట్‌కు నాలుగు ఈవీఎంలను (నోటాతో కలిపి 64 పేర్లు) కనెక్ట్ చేసే వీలున్నది. ఎం-5 మోడల్ వాడితే మరిన్ని ఇవీఎంలను కూడా లింక్ చేయవచ్చు.

మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పిరమిడ్ పార్టీ, తెలంగాణ యువశక్తి, ప్రజా ఏక్తా పార్టీ, యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ, తెలంగాణ సకలజనుల పార్టీ, యుగతులసి, జైభారత్ నేషనల్ పార్టీ, సోషల్ జస్టిస్ పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, బహుజన్ ముక్తి పార్టీ, రిపబ్లిక్ సేన, ప్రజావాణి పార్టీ... ఇలా పదుల సంఖ్యలో రిజిస్టర్డ్ పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా అన్ని నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో నామినేషన్లు వేశారు. గత ఎన్నికల్లో (2019లో) అత్యధికంగా నిజామాబాద్‌లో దాఖలయ్యాయి.

వారం రోజుల్లో దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే...

ఏప్రిల్ 18న – 42 మంది – 48 నామినేషన్లు

ఏప్రిల్ 19న – 58 మంది – 69 నామినేషన్లు

ఏప్రిల్ 20న – 69 మంది – 169 నామినేషన్లు

ఏప్రిల్ 22న – 144 మంది – 169 నామినేషన్లు

ఏప్రిల్ 23న – 165 మంది – 191 నామినేషన్లు

ఏప్రిల్ 24న – 167 మంది – 302 నామినేషన్లు

ఏప్రిల్ 25న – దాదాపు 550కు పైగా నామినేషన్లు

Advertisement

Next Story