‘పొత్తు పెట్టుకుందామని BJP బతిమాలినా ఒప్పుకోం’

by GSrikanth |
‘పొత్తు పెట్టుకుందామని BJP బతిమాలినా ఒప్పుకోం’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ అవినీతి చక్రవర్తి అని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తరచూ కేసీఆర్ అవినీతిపై మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు ఎందుకు నిరూపించలేకపోతున్నాయని అడిగారు. పదేళ్లుగా దేశ సంపదను మోడీ ధనవంతులకు దోచి పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీలు తోడు దొంగలు అని అన్నారు. బీజేపీతో పొత్తుకు తాము ఏనాడూ వెంపర్లాడలేదని చెప్పారు.

పొత్తు కోసం బీజేపీనే ముందుకు వచ్చినా తాము అంగీకరించం అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని విమర్శించారు. ఎన్నికలు ఉన్న సమయంలోనే రైతుబంధు నాలుగెకరాల వరకు ఇచ్చేందుకు నాలుగు నెలలు పట్టిందని, ఎన్నికల తతంగం పూర్తయితే అదికూడా నిలిపివేస్తారని, ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. అన్ని వర్గాలకు కొండంత అండ కేసీఆరే అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు.

Advertisement

Next Story