ఆ విషయంలో అంతా భిన్నంగా జరిగింది.. పోలింగ్‌పై ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

by GSrikanth |
ఆ విషయంలో అంతా భిన్నంగా జరిగింది.. పోలింగ్‌పై ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌పై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ అనుకున్న దానికంటే భిన్నంగా పోలింగ్ జరిగిందని అన్నారు. ఈ నిశ్శబ్ద విప్లవం ఫలితం జూన్ 4వ తేదీన తెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనలోనే దేశం ముందుకెళ్తుందని ప్రజలు భావించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. గతంలో ఎన్నడూ ఊహించని రేంజ్‌లో రాష్ట్రంలో బీజేపీ ఫలితాలు సాధించబోతోందని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తప్పకుండా దేశ వ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలోనూ 12 సీట్లకు పైగా వస్తాయని జోస్యం చెప్పారు. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నా.. దేశంలో మోడీనే ఉండాలనే బలమైన అభిప్రాయం అందరిలోనూ వచ్చిందని తెలిపారు. మోడీ లాంటి స్ట్రాంగ్ లీడర్‌ను ఎవరూ కాదనుకోరు అని అన్నారు. ఇక రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ఫైట్ ఉంటుందని విమర్శించారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్‌లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతోనే బరిలోకి దిగాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక క్రమంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు చేయడం ప్రారంభించారని మండిపడ్డారు. అందుకే తీవ్ర అసహనానికి గురైన ప్రజలు ఓటు రూపంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని అన్నారు.

Advertisement

Next Story