బీఎస్‌పీతో పొత్తుకు ఆ ఒక్కటే కారణమా?.. కొత్త ఈక్వేషన్‌తో ఫలితంపై చర్చలు

by GSrikanth |
బీఎస్‌పీతో పొత్తుకు ఆ ఒక్కటే కారణమా?.. కొత్త ఈక్వేషన్‌తో ఫలితంపై చర్చలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, బీఎస్పీ కొత్త పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే బీఎస్పీ కేడర్ బీఆర్ఎస్‌కు సహకరిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే బీఎస్పీ పొత్తుపై గులాబీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. రెండు సీట్లు ఆ పార్టీకి కేటాయించినా గెలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో ఒంటరయ్యామన్న సంకేతం ఉండటంతోనే ఈ పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య సహకారం ఉంటుందా? ఎన్నికల్లో గట్టెక్కుతారా? అని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి పరాజయం పాలైన బీఆర్ఎస్.. దళితుల ఓటుబ్యాంకు దూరమైందని భావించి బీఎస్పీతో పొత్తుకుదుర్చుకున్నారు.

ఈ ఎత్తుగడతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందించారు. పొత్తుల్లో భాగంగానే బీఎస్పీ పార్టీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. అయితే హైదరాబాద్కు మాత్రం అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించలేదు. నాగర్ కర్నూల్ నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. కానీ, బీఎస్పీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపునకు మళ్లుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఆర్ఎస్పీకి దళిత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధును ప్రవేశపెట్టి అందరికి ఇవ్వలేదనే ఆగ్రహంతో ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ మాటను విశ్వసించి ఓటువేస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్గా మారింది. బీఎస్పీ పోటీచేస్తే ఆ అభ్యర్థికి ఓటు వేస్తారని, కానీ బీఆర్ఎస్కు మాత్రం వేయరనే ప్రచారం జరుగుతుంది.

పొత్తుపై గులాబీ పార్టీలో అసంతృప్తి

అయితే ఈ పొత్తుపై బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోనూ అసహనం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన ఆర్ఎస్పీతో పొత్తుపెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు పార్టీ మారారు. ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీలు సైతం పొత్తు వద్దని కేసీఆర్కు విన్నవించినట్లు సమాచారం. పార్టీ నుంచి పోటీ చేస్తే కేడర్ సహకరిస్తుంది.. కానీ బీఎస్పీకి వేయమంటే వేసే పరిస్థితి లేదని కొందరు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతేకాదు పొత్తుతో ఆదిలాబాద్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

నాడు పొత్తులో ఉన్న వామపక్షాలకు బ్రేక్

2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తుతో ముందుకు సాగి బీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పొత్తుతో గట్టెక్కారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీచేసి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓంటరిగా పోటీచేసింది.

బీఎస్పీ విజయంపై నీలినీడలు?

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన రాములు 1,89,748 ఓట్లతో విజయం సాధించారు. 50.48శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు31.31 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 12,474 ఓట్లు వచ్చాయి. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల , ఆలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగితా ఐదింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. గెలుపు అసాధ్యమైన కారణంగానే బీఎస్పీకి ఈ సీటు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. బీఎస్పీకి ఓటు బ్యాంకు కేవలం 12 వేలు మాత్రమే ఉండటంతో అనుమానాలు నెలకొన్నాయి. అయితే, ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ సీటును బీఎస్పీకి కేటాయించటమూ చర్చకు దారితీసింది.

ఒక్కశాతంతో ఓడిపోయామంటూ..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క శాతం ఓటింగ్తో ఓడిపోయామంటూ ప్రచారం చేస్తోంది. సమీక్ష సమావేశాలు, మీడియా సమావేశాల్లో పార్టీ నేతలంతా పేర్కొంటున్నారు. అయితే బీఎస్పీ పొత్తుతో ఆ ఒక్క శాతం ఓట్లు కలిసి వస్తాయా? కొత్త పొత్తు చిగురిస్తుందా? పార్టీ కేడర్తో పాటు ప్రజలు పొత్తును ఆశీర్వదిస్తారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదీ ఏమైనప్పటికీ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed