ఆ గెలుపే నన్ను ముఖ్యమంత్రిని చేసింది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
ఆ గెలుపే నన్ను ముఖ్యమంత్రిని చేసింది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజిగిరి పార్లమెంట్ నేతలు, కార్యకర్తలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సీఎం కుర్చీలో కూర్చోవడానికి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలే కారణమన్నారు. నాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై జెండా మోసి తనను ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. 2,964 బూత్‌లలో ప్రతీ బూత్‌లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని.. మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని తెలిపారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందని అన్నారు.

వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం.. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదని చెప్పారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంఖుస్థాపన చేసునుకున్నామని అన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా.. కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా.. మల్కాజిగిరిలో పార్లమెంట్ పరిధిలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదని గుర్తుచేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది అన్నారు. అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలని సూచించారు. హోలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని.. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి.. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి.. రేపు సాయంత్రం కంటోన్మెంట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ గెలుపు అభ్యర్థిది కాదు.. ముఖ్యమంత్రిది అని సూచించారు. నా బలం.. నా బలగం మీరే అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed