సొంత ఇలాఖాలో జగదీష్ రెడ్డికి బిగ్ షాక్.. బీజేపీలో చేరడానికి సిద్ధమైన కీలక నేతలు

by GSrikanth |
సొంత ఇలాఖాలో జగదీష్ రెడ్డికి బిగ్ షాక్.. బీజేపీలో చేరడానికి సిద్ధమైన కీలక నేతలు
X

దిశ, నల్లగొండ బ్యూరో: తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా గండిపడనుంది. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు, మాజీలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న గుజ్జా దీపిక యుగేంధర్ సొంత మండలం తుంగతుర్తి నుంచి ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కొంతమంది ముఖ్యమైన నాయకులు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సొంత మండలం నాగారం నుంచి ప్రస్తుత ప్రజాప్రతినిధులు, కొంతమంది ప్రముఖ నాయకులు, మద్దిరాల మండలం నుంచి ప్రస్తుతం ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్న మండల స్థాయి నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులతో పాటుగా సుమారు 100 మందికి పైగా ప్రజా ప్రతినిధులు భారీ స్థాయిలో పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. బీజేపీ నేతలు సంకినేని వెంకటేశ్వరరావు, సంకినేని కృష్ణారావులతో మొదటి దఫా చర్చలు పూర్తయినట్లు సమాచారం.

తుంగతుర్తి కేంద్రంగా చేరికలు...

నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ సంబంధించిన వంద మందికి పైగా ప్రజా ప్రతినిధులతో బీజేపీలో చేరేలా నేతలు మొదట భావించినట్టు తెలిసింది. కానీ ఒకే చోట చేరికలు పెట్టడం కన్నా ఏ మండలానికి సంబంధించిన నేతలను ఆ మండలంలోనే చేరికలు పెడితే బీఆర్ఎస్ పార్టీని పరోక్షంగా మానసికంగా దెబ్బకొట్టి బీజేపీకి లాభం చేకూరేలా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చేరికల ప్రభావంతో నియోజకవర్గంలో మరి కొంతమంది నేతలు కూడా బీజేపీ గూటికి చేరే అవకాశాలున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో పార్టీలో కీలక నేతగా ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు సోదరుల సొంత నియోజకవర్గం తుంగతుర్తి కావడంతో ఎలాగైనా బీజేపీ బలం పెంచడంతోపాటు కారును షెడ్డుకు పంపించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

బీజేపీలో కనిపిస్తున్న ఉత్సాహం...

తుంగతుర్తి నియోజకవర్గం లో గతంలో కంటే ఈసారి ఉత్సాహం. గతంలో బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు సోదరుల చొరవతో తుంగతుర్తి సర్పంచ్ తో పాటు ఒకరిద్దరు ప్రజాప్రతినిగా ఎన్నికైనప్పటికీ పెద్దగా పార్టీ ప్రభావం లేదు. కానీ కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ వస్తున్న అనుకూలమైన వాతావరణం వల్ల కమలం పంచన చేరేందుకు నేతలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలన్నీ కూడా సంకినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోనే నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, నియోజకవర్గంలో పెద్దగా పరిచయం లేని కాంగ్రెస్ అభ్యర్థి బలహీనతలను ఆసరాగా చేసుకొని పార్టీ అభివృద్ధితోపాటు భారీ స్థాయిలో ఓట్లు రాబట్టేందుకు సంకినేని సోదరులు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story