‘ఇండియా’కు మంచి రోజులు !

by Swamyn |
‘ఇండియా’కు మంచి రోజులు !
X

దిశ, నేషనల్ బ్యూరో: మొన్నటిదాకా కుదుపులకు లోనైన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి నెమ్మదిగా మంచి రోజులు వస్తున్నట్టు కనిపిస్తోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూటమిని వీడటం, బెంగాల్‌, పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని అక్కడి అధికార పార్టీలు ప్రకటించడంతోపాటు ఇతర విభేదాలతో అతలాకుతలమైన ‘ఇండియా’ పరిస్థితి.. కాస్త మెరుగుపడుతున్నట్టు తెలుస్తోంది. వరుస షాకుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అంతేకాకుండా, సీట్ల పంపకాల విషయంలోనూ వేగం పెంచింది. పైగా, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పు సైతం కూటమికి నూతన ఉత్సాహాన్నిచ్చేదే. ఈ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి కూటమి తరఫున నిలబెట్టిన ఉమ్మడి అభ్యర్థి విజయం(సుప్రీంకోర్టు తీర్పు అనంతరం) సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి నేరుగా తలపడ్డ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ఇందులో ‘ఇండియా’ అభ్యర్థి గెలవడంతో కూటమి నేతల్లో జోష్ పెరిగినట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రతిపక్ష కూటమికి ఇది పెద్ద విజయమని, ఈ సందర్భంగా కూటమి నేతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానంటూ పేర్కొన్నారు. ఈ ఉత్సాహంలోనే సీట్ల పంపకాలపై స్పష్టతతోపాటు నేతల మధ్య నెలకొన్న విభేదాలు క్రమంగా తొలగుతున్నట్టు అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా.. ఎలక్షన్లకు ముందు ‘ఇండియా’ నేతలంతా ఏకతాటిపైకి వస్తుండటం కూటమికి శుభపరిణామమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సీట్ల షేరింగ్‌ ప్రక్రియ వేగవంతం

కూటమి ఏర్పడి ఏడాది కావొస్తున్నా సీట్ల పంపకాల్లో నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన పార్టీలు.. తాజాగా ఆ ప్రక్రియను వేగవంతం చేశాయి. సీట్ షేరింగ్‌పై కీలకమైన కాంగ్రెస్ పార్టీయే ముందుకు రావడం లేదంటూ కూటమిని వీడిన నితీశ్ కుమార్‌తోపాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. హస్తం పార్టీ నుంచి స్పష్టత రాకపోవడంతోనే, ఇక లాభం లేదనుకుని బెంగాల్‌లో ఒంటిరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు మమత తెలిపారు. పంజాబ్‌లోని ఆప్ సైతం ఇదే కారణం చెప్పింది. దీంతో ఇంకా ఆలస్యం చేస్తే మరింత నష్టపోతామని గ్రహించిన కాంగ్రెస్.. సీట్ల పంపకాల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే దేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. 80 స్థానాలున్న యూపీలో ఎస్పీ 63, కాంగ్రెస్ 17 నియోజకవర్గాల్లో పోటీచేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీనిపై కూటమి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఎస్పీ సీనియర్ నేత రవిదాస్ మెహ్రోత్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫలితంగా మొన్నటిదాకా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో పాల్గొంటానని తెలిపారు.

త్వరలోనే మిగతా రాష్ట్రాల్లోనూ..

యూపీ తర్వాత ఢిల్లీలోనూ సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దేశ రాజధానిలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలుండగా, అధికార ఆప్ 4 చోట్ల, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు గుజరాత్, గోవా, చండీగఢ్, హర్యానాలో ఆప్‌, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపాయి. ఈ రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాయో ఒకటి, రెండు రోజుల్లో తెలుస్తుందని కూటమిలోని కీలక నేత ఒకరు తెలిపినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.


Advertisement

Next Story