పెట్రోల్ ధరల తగ్గింపు.. ఫ్రీ రేషన్.. ఉచితంగా 10 ఎల్పీజీ సిలిండర్లు..

by Swamyn |
పెట్రోల్ ధరల తగ్గింపు.. ఫ్రీ రేషన్.. ఉచితంగా 10 ఎల్పీజీ సిలిండర్లు..
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం బెంగాల్‌లో అధికార టీఎంసీ పార్టీ బుధవారం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో కీలక హామీలను ప్రకటించింది. ఎన్డీయేను ఓడించి ‘ఇండియా’ కూటమిని గెలిపిస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ను రద్దు చేస్తామని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని ఆపేస్తామని హామీ ఇచ్చింది. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)నీ అమలు చేయబోమని స్పష్టం చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ ‘‘దీదిర్ శపొత్’’(దీదీ ప్రతిజ్ఞలు) పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘రానున్న ఎన్నికల్లో గెలిచి, కేంద్రంలో ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పడితే కూటమిలో భాగంగా మేము నెరవేర్చే వాగ్దానాలు ఇవి’’ అంటూ మేనిఫెస్టోలని హామీలను వెల్లడించారు. కాగా, బెంగాల్‌లో సీట్ల పంపకాల్లో విభేదాలతో ఇండియా కూటమి నుంచి టీఎంసీ బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.

టీఎంసీ మేనిఫెస్టోలోని కీలకాంశాలు:

* జాబ్ కార్డు ఉన్నవాళ్లందరికీ రోజుకు రూ.400 వేతనంతో ఏటా 100 రోజుల ఉపాధి హామీ.

* దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పేద కుటుంబానికీ సురక్షితమైన, గౌరవప్రదమైన ఇంటి నిర్మాణం.

* రేషన్ కార్డుదారులందరికీ నెలకు 5కేజీల ఉచిత రేషన్.. నేరుగా ఇంటికే డెలివరీ

* దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు ఏటా 10 ఎల్పీజీ సిలిండర్లు ఉచితం

* స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ. అన్ని పంటల సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50శాతం అధిక చెల్లింపులు.

* 60ఏళ్లు పైబడినవారికి వృద్ధాప్య పెన్షన్ రూ.వెయ్యికి పెంపు

* 25ఏళ్లలోపు పట్టభద్రులు, డిప్లోమా హోల్డర్లకు ఏడాదిపాటు స్టైపండ్‌తో కూడిన అప్రెంటిస్‌షిప్.

* పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల ధరల తగ్గింపు

* రూ.10 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ


Advertisement

Next Story