IPL 2023: శ్రీలంక ఆటగాళ్లు వచ్చేస్తున్నారు..

by Vinod kumar |
IPL 2023: శ్రీలంక ఆటగాళ్లు వచ్చేస్తున్నారు..
X

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ క్రికెటల్ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్-16‌లో పలు మ్యాచ్‌లకు దూరమైన శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటగాళ్లు లీగ్‌లో చేరబోతున్నారు. ఐపీఎల్‌లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంకకు చెందిన డాసున్ షనక(గుజరాత్ టైటాన్స్), వానిందు హసరంగ(ఆర్సీబీ), మహేశ్ తీక్షణ(సీఎస్కే), మతీష పతిరన(సీఎస్కే) న్యూజిలాండ్‌తో సిరీస్ కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. శనివారంతో కివీస్‌తో టీ20 సిరీస్ ముగియడంతో వారు ఐపీఎల్‌లో భాగం కాబోతున్నారు. వారి రాకతో చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మరింత బలంగా మారనున్నాయి. స్పిన్నర్ మహేశ్ తీక్షణ, పేసర్ మతీష్ పతిరన ఈ నెల 12న రాజస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్టు చెన్నయ్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.

గతేడాది సీఎస్కే జట్టులో అరగేంట్రం చేసిన తీక్షణ పవర్ ప్లే‌లో అద్భుతంగా రాణించి 7.46 ఎకానమీతో 12 వికెట్లు తీసుకున్నాడు. కేన్ విలియమ్సన్ గాయం కారణంగా లీగ్‌ నుంచి వైదొలగగా.. అతని స్థానంలో గుజరాత్ ఫ్రాంచైజీ శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. టీ20‌ల్లో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఉన్న షనక రాకతో గుజరాత్ మరింత బలంగా మారనుంది. అలాగే, బంతితోపాటు బ్యాటుతోనూ మెరిపించే హసరంగ అందుబాటులోకి రావడంతో ఆర్సీబీ మిడిలార్డర్ బలోపేతమైంది. ఐర్లాండ్‌తో సిరీస్ ముగియడంతో బంగ్లా వికెట్‌ కీపర్ లిటాన్ దాస్ కూడా లీగ్‌లో భాగంకానున్నాడు. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్న అతన్ని.. కోల్‌కతా ఫ్రాంచైజీ వేలంలో రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచి ఫామ్‌లో లిటాన్ దాస్ రాకతో కేకేఆర్ బ్యాటింగ్ దళంలో కీలకంగా మారనున్నాడు.

Advertisement

Next Story