రెచ్చిపోయిన కరన్.. రాజస్థాన్‌కు వరుసగా నాలుగో ఓటమి

by Harish |
రెచ్చిపోయిన కరన్.. రాజస్థాన్‌కు వరుసగా నాలుగో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ మళ్లీ తడబడింది. ఆ జట్టుకు వరుసగా నాలుగో ఓటమి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకోవడంతో నాకౌట్ టెన్షన్ లేనప్పటికీ.. వరుస పరాజయాలు ఆ జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవే. గువహతి వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో కష్టపడి 144/9 స్కోరు చేసింది. రియాన్ పరాగ్(48) రాణించాడు. అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సామ్ కరన్(63 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా బంతితో, బ్యాటుతో మెరిసి కరన్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

రెచ్చిపోయిన కరన్

145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ కాస్త శ్రమించింది. కెప్టెన్ సామ్ కరన్(63 నాటౌట్) రెచ్చిపోవడంతో ఆ జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అయితే, ఛేదనలో మొదట పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. రాజస్థాన్ బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకునే దిశగా మొదటి నుంచే ప్రత్యర్థి జట్టును ఇబ్బందులకు గురిచేశారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(6) తొలి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రిలే రొసోవ్(22) ఐదు ఫోర్లతో దూకుడుగా కనిపించాడు. కానీ, అవేశ్ ఖాన్ ఒకే ఓవర్‌లో అతనితోపాటు శశాంక్ సింగ్(0)ను అవుట్ చేశాడు. బెయిర్ స్టో(14) కూడా ఎంతో సేపు క్రీజులో నిలువలేదు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ విజయావకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ పరిస్తితుల్లో సామ్ కరన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ స్కోరు బోర్డు వేగం పెంచాడు. అతనికి జితేశ్ శర్మ(22) కాసేపు సహకరించాడు. జితేశ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించి జట్టును పోటీలోకి తీసుకొచ్చాడు. జితేశ్ అవుటైనా అశుతోష్ శర్మ(17 నాటౌట్)తో కలిసి కరన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్‌కు ఒక్క వికెట్ దక్కింది.

మెరిసిన పంజాబ్ బౌలర్లు

అంతకుముందు రాజస్థాన్ బ్యాటర్లు పంజాబ్ బౌలింగ్‌లో తడబడ్డారు. రియాన్ పరాగ్(48) మినహా మిగతా వారు విఫలమయ్యారు. రాజస్థాన్ తొలి ఓవర్‌ నుంచే తడబడింది. సామ్ కరన్ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ యశస్వి జైశ్వాల్(4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ కోహ్లెర్ కాడ్‌మోర్‌(18), కెప్టెన్ శాంసన్(18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. దీంతో 42 పరుగులకే రాజస్థాన్ 3 వికెట్లు కష్టాల్లో పడగా.. రియాన్ పరాగ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అశ్విన్(28)‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే, అశ్విన్ అవుటైన తర్వాత రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ధ్రువ్ జురెల్(9), రొవ్‌మన్ పావెల్(4), ఫెరీరా(7) నిరాశపరిచారు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో రియాన్ పరాగ్ వికెట్ల ముందు దొరికిపోగా.. చివరి బంతికి బౌల్ట్(12) రనౌటయ్యాడు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 150 పరుగుల్లోపే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్‌కు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 144/9(20 ఓవర్లు)

జైశ్వాల్(బి)సామ్ కరన్ 4, కోహ్లెర్ కాడ్‌మోర్(సి)జితేశ్(బి)రాహుల్ చాహర్ 18, శాంసన్(సి)రాహుల్ చాహర్(బి)నాథన్ ఎల్లిస్ 18, రియాన్ పరాగ్ ఎల్బీడబ్ల్యూ(బి)హర్షల్ పటేల్ 48, అశ్విన్(సి)శశాంక్(బి)అర్ష్‌దీప్ 28, ధ్రువ్ జురెల్(సి)హర్‌ప్రీత్ బ్రార్(బి)సామ్ కరన్ 0, రొవ్‌మన్ పావెల్(సి అండ్ బి)రాహుల్ చాహర్ 4, ఫెరీరా(సి)రొసోవ్(బి)హర్షల్ పటేల్ 7, బౌల్ట్ రనౌట్(శశాంక్/బెయిర్‌స్టో) 12, అవేశ్ ఖాన్ 3 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.

వికెట్ల పతనం : 4-1, 40-2, 42-3, 92-4, 97-5, 102-6, 125-7, 138-8, 144-9

బౌలింగ్ : సామ్ కరన్(3-0-24-2), అర్ష్‌దీప్(4-0-31-1), నాథన్ ఎల్లిస్(4-0-24-1), హర్షల్ పటేల్(4-0-28-2), రాహుల్ చాహర్(4-0-26-2), హర్‌ప్రీత్ బ్రార్(1-0-10-0)

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 145/5(18.5 ఓవర్లు)

ప్రభ్‌సిమ్రాన్ సింగ్(సి)చాహల్(బి)బౌల్ట్ 6, బెయిర్‌స్టో(సి)రియాన్ పరాగ్(బి)చాహల్ 14, రిలే రొసోవ్(సి)జైశ్వాల్(బి)అవేశ్ ఖాన్ 22, శశాంక్ సింగ్ ఎల్బీడబ్ల్యూ(బి)అవేశ్ ఖాన్ 0, సామ్ కర్రన్ 63 నాటౌట్, జితేశ్ శర్మ(సి)రియాన్ పరాగ్(బి)చాహల్ 22, అశుతోష్ శర్మ 17 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 1.

వికెట్ల పతనం : 6-1, 36-2, 36-3, 48-4, 111-5

బౌలింగ్ : బౌల్ట్(3-0-27-1), సందీప్ శర్మ(4-0-28-0), అవేశ్ ఖాన్(3.5-0-28-2), అశ్విన్(4-0-31-0), యుజువేంద్ర చాహల్(4-0-31-2)

Advertisement

Next Story

Most Viewed