నితీశ్ మెరుపులే గెలిపించాయి.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై హైదరాబాద్ విజయం

by Harish |
నితీశ్ మెరుపులే గెలిపించాయి.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై హైదరాబాద్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ :హెడ్, అభిషేక్, మార్‌క్రమ్, క్లాసెన్ ఎవరూ హైదరాబాద్‌ను ఆదుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఒక్కడొచ్చాడు. అతనికి ఇది లీగ్‌లో రెండో మ్యా్చ్ మాత్రమే. గత మ్యాచ్‌లో చివరి విన్నింగ్ షాట్ కొట్టడం తప్పితే ఆ 20 ఏళ్ల కుర్రాడిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, అతనే హైదరాబాద్ విజయానికి కారణమయ్యాడు. అతని మెరుపులే జట్టును గట్టెక్కించాయి. అతనే నితీశ్ రెడ్డి. ఈ వైజాగ్ కుర్రాడు పంజాబ్‌పై కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 10 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 66/4.. అక్కడి నుంచి 182/9 స్కోరు చేసిందంటే కారణమతనే. అదే 10 ఓవర్లలో పంజాబ్ స్కోరు 64/4.. కానీ, ఆ జట్టు 180/6 స్కోరు వద్ద ఆగిపోయింది. ఇదే నిదర్శనం నితీశ్ రెడ్డి మెరుపులే జట్టును గెలిపించాయనడానికి. ఫలితంగా హైదరాబాద్ ఈ సీజన్ బయటి స్టేడియంలో తొలి విజయాన్ని అందుకుంది.

ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. చండీగఢ్ వేదికగా మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 182/9 స్కోరు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(64) సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అబ్దుల్ సమద్(25) విలువైన పరుగులు జోడించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/29) సత్తాచాటాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 180/6 స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌లో ప్రత్యర్థిని నిలువరించారు. ఆఖర్లో శశాంక్ సింగ్(46 నాటౌట్), అశుతోష్ శర్మ(33 నాటౌట్) పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్స్‌లో 5వ స్థానానికి చేరుకుంది.

శశాంక్, అశుతోష్ పోరాటం సరిపోలె

ఛేదనకు దిగిన పంజాబ్‌ను భువనేశ్వర్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో ఓపెనర్ ధావన్(14), ప్రభ్‌సిమ్రాన్(4)లను పెవిలియన్ పంపాడు. కాసేపటికే బెయిర్‌స్టో(0) డకౌటవడంతో పంజాబ్ 20/3తో తడబడింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో సామ్ కర్రన్(29), సికందర్ రజా(28) ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు చూసినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. జితేశ్ శర్మ(19) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో 16 ఓవర్లలో పంజాబ్ 116/6 స్కోరుతో కోలుకునేలా కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ మరోసారి మెరిశారు. బౌలర్లపై విరుచుకపడిన ఈ జోడీ ఆఖరి నాలుగు ఓవర్లలో 66 పరుగులు రాబట్టింది. దీంతో పంజాబ్ జట్టులో గెలుపు ఆశలు చిగురించాయి. చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా.. శశాంక్(46 నాటౌట్), అశుతోష్(33 నాటౌట్) హైదరాబాద్‌ను టెన్షన్ పెట్టారు. వీరు 26 పరుగులు పిండుకోవడంతో పంజాబ్ విజయానికి 3 పరుగుల దూరంలో ఆగిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2 వికెట్లు తీయగా.. కమిన్స్, నటరాజన్, నితీశ్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ చెరో వికెట్ తీశారు.

దంచికొట్టిన నితీశ్

అంతకుముందు హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఆటే హైలెట్. స్టార్ ప్లేయర్లు నిరాశపర్చిన వేళ నితీశ్ గొప్ప పోరాట పటిమ కనబర్చాడు. మొదట ఓపెనర్లు హెడ్(21)‌, అభిషేక్ శర్మ(16) ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించినా అది కాసేపే. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెడ్‌తోపాటు మార్‌క్రమ్(0) పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 27/2తో నిలిచింది. కాసేపటికే అభిషేక్ కూడా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చాడు నితీశ్. మొదట్లో అతను నిదానంగానే ఆడాడు. మరో ఎండ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ త్రిపాఠి(11), క్లాసెన్(9) నిరాశపర్చడంతో నితీశ్ జట్టు భారాన్ని మీదేసుకున్నాడు. ఒక్కసారిగా పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి గేర్ మార్చాడు. ఆ తర్వాత ఓవర్‌కో సిక్స్ కొడుతూ అభిమానుల్లో జోష్ నింపాడు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టి 22 పరుగులు పిండుకున్నాడు. అతనికితోడు అబ్దుల్ సమద్(25) కూడా ఫోర్లు దంచడంతో స్కోరు పరుగులు పెట్టింది. అయితే, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సమద్ అవుటవడంతో ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్‌లో నితీశ్ రెడ్డి(64) దూకుడు కూడా అర్ష్‌దీప్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత కమిన్స్(3), భువనేశ్వర్(3) వికెట్లు పారేసుకోగా.. షాబాజ్ అహ్మద్(14 నాటౌట్), జయదేవ్ ఉనద్కత్(6 నాటౌట్) అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 4 వికెట్లతో సత్తాచాటగా.. సామ్ కర్రన్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. రబాడ ఒక్క వికెట్ పడగొట్టాడు.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 182/9(20 ఓవర్లు)

హెడ్(సి)ధావన్(బి)అర్ష్‌దీప్ 21, అభిషేక్(సి)శశాంక్(బి)సామ్ కర్రన్ 16, మార్‌క్రమ్(సి)జితేశ్ శర్మ(బి)అర్ష్‌దీప్ 0, నితీశ్ రెడ్డి(సి)రబాడ(బి)అర్ష్‌దీప్ 64, త్రిపాఠి(సి)జితేశ్ శర్మ(బి)హర్షల్ 11, క్లాసెన్(సి)సామ్ కర్రన్(బి)హర్షల్ 9, అబ్దుల్ సమద్(సి)హర్షల్(బి)అర్షల్ 25, షాబాజ్ అహ్మద్ 14 నాటౌట్, కమిన్స్(బి)రబాడ 3, భువనేశ్వర్(సి)బెయిర్ స్టో(బి)సామ్ కర్రన్ 6, జయదేవ్ ఉనద్కత్ 6 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 27-1, 27-2, 39-3, 64-4, 100-5, 150-6, 151-7, 155-8, 176-9

బౌలింగ్ : రబాడ(4-0-32-1), అర్ష్‌దీప్ సింగ్(4-0-29-4), సామ్ కర్రన్(4-0-41-2), హర్షల్ పటేల్(4-0-30-2), హర్‌ప్రీత్ బ్రార్(4-0-48-0)

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 180/6(20 ఓవర్లు)

ధావన్(స్టంప్)క్లాసెన్(బి)భువనేశ్వర్ 14, బెయిర్ స్టో(బి)కమిన్స్ 0, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(సి)నితీశ్ రెడ్డి(బి)భువనేశ్వర్ 4, సామ్ కర్రన్(సి)కమిన్స్(బి)నటరాజన్ 29, సికిందర్ రజా(సి)క్లాసెన్(బి)జయదేవ్ ఉనద్కత్ 28, శశాంక్ సింగ్ 46 నాటౌట్, జితేశ్ శర్మ(సి)అభిషేక్ శర్మ(బి)నితీశ్ రెడ్డి 19, అశుతోష్ శర్మ 33 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 2-1, 11-2, 20-3, 58-4, 91-5, 114-6

బౌలింగ్ : భువనేశ్వర్(4-1-32-2), కమిన్స్(4-0-22-1), నటరాజన్(4-0-33-1), నితీశ్ రెడ్డి(3-0-33-1), జయదేవ్ ఉనద్కత్(4-0-49-1), షాబాజ్ అహ్మద్(1-0-10-0)

Advertisement

Next Story

Most Viewed