శశాంక్ అలాంటి వాడు కాదు : ప్రీతి జింటా

by Harish |
శశాంక్ అలాంటి వాడు కాదు : ప్రీతి జింటా
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ గుజరాత్‌పై సంచలన ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అతను హీరో అయిపోయాడు. అయితే, ఐపీఎల్-17 వేలంలో శశాంక్ సింగ్‌‌ను కొనుగోలు చేసే సమయంలో పంజాబ్ కన్ఫ్యూజ్ అయ్యింది. రూ. 20 లక్షలకు శశాంక్‌ను కొనుగోలు చేసిన పంజాబ్ ఆ తర్వాత తాము తీసుకోవాలనుకున్న శశాంక్ అతను కాదని చెప్పింది. అయితే, అప్పటికే వేలం పూర్తవడంతో పంజాబ్ ఏం చేయలేకపోయింది. తాజాగా గుజరాత్‌పై శశాంక్ రెచ్చిపోవడంతో వద్దనుకున్నవాడే పంజాబ్‌కు వరమయ్యాడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కో ఓనర్ ప్రీతి జింటా తాజాగా స్పందించింది.

సోషల్ మీడియా వేదికగా శశాంక్‌పై ప్రశంసలు కురిపించింది. ‘వేలంలో జరిగిన దాని గురించి మాట్లాడుకోవడానికి ఇదే సరైన సమయంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆత్మవిశ్వాసం కోల్పోయి ఒత్తిడికి గురవుతారు. కానీ, శశాంక్ అలా కాదు. అతను చాలా మందిలా కాదు. అతను చాలా స్పెషల్. ప్రతిభగల ఆటగాడిగానే కాదు. సానుకూల దృక్పథం, ప్రేరణ కారణంగానూ అతను స్పెషలే. అతనిపై వచ్చిన కామెంట్లను, జోక్‌లను సరదాగా తీసుకుంటాడు. అతను ఎప్పుడూ బాధితుడు కాదు. తనను తాను నమ్ముకున్నాడు. అతనేంటో మాకు చూపించాడు. జీవితంలో అనుకున్నది జరగనప్పుడు అందరికి అతనే ఆదర్శం. అందరు ఏమనుకుంటున్నారనేది కాదు. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. శశాంక్‌లాగా మిమ్మల్ని మీరు నమ్మండి. జీవితం అనే ఆటలో మీరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తారు.’ అని చెప్పుకొచ్చింది. కాగా, గుజరాత్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శశాంక్ హాఫ్ సెంచరీతో మెరిసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story