- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్య ప్రతాపం.. భయపెట్టిన అశుతోష్ శర్మ.. పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చండీగఢ్ వేదికగా పంజాబ్‌పై 9 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(78) అర్ధసెంచరీతో తన ప్రతాపం చూపగా, రోహిత్ శర్మ(36), తిలక్ వర్మ(34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక, 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 9 పరుగుల తేడాతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. పంజాబ్ బ్యాటర్లలో అశుతోష్ శర్మ(61) వీరోచితంగా పోరాడాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ పంజాబ్ చేతుల్లోనే ఉంది. కానీ, చివర్లో అవుటయ్యాడు. అశుతోష్‌తోపాటు శశాంక్ సింగ్(41) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా మ్యాచ్ చివరివరకు వచ్చి థ్రిల్లింగ్‌గా ముగిసిందంటే దానికి అశుతోష్ శర్మ అద్భతమైన ఇన్నింగ్సే కారణం. ముంబై బౌలర్లలో గెరాల్డ్, బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ మధ్వాల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా, సామ్ కరన్ రెండు, రబాడా ఒక వికెట్ పడగొట్టారు.
టాప్ ఆర్డర్ టపటపా..
193 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు చావుదెబ్బ కొట్టారు. బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు సామ్ కరన్(6), ప్రభుసిమ్రాన్ సింగ్(0), రిలీ రస్సో(1), లివింగ్ స్టోన్(1), హర్‌ప్రీత్ సింగ్(13) సింగిల్ డిజిట్‌కే(హర్‌ప్రీత్ మినహా) పరిమితమయ్యారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ప్రభుసిమ్రాన్‌ను గెరాల్డ్ క్యాచ్ అవుట్ చేయగా, రెండో ఓవర్ వేసిన బుమ్రా.. అదే ఓవర్‌లో రిలీ రస్సో, సామ్ కరన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్‌లను శ్రేయస్ గోపాల్, గెరాల్డ్ అవుట్ చేశారు. దీంతో కేవలం 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఐదో వికెట్ కోల్పోయిన కొద్దిసేపటికే 77 పరుగుల వద్ద మరో బ్యాటర్ జితేశ్ శర్మ(9) వికెట్ పారేసుకున్నాడు. దీంతో పంజాబ్ జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది.
అశుతోష్ విధ్వంసం
వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల జోడీ అదరగొట్టింది. అంతకుముందు నుంచే క్రీజులో ఉన్న శశాంక్ సింగ్.. అశుతోష్‌తో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడుతున్న శశాంక్ సింగ్(41; 25బంతుల్లో 3 సిక్సులు, 2 ఫోర్లు)ను బుమ్రా అవుట్ చేశాడు. అయినప్పటికీ ఏమాత్రం బెదరని అశుతోష్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 23 బంతుల్లోనే 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ చేసుకున్నాడు. పంజాబ్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అన్న పరిస్థితి నుంచి అశుతోష్ దూకుడుకు మ్యాచ్‌పై.. ముంబై పట్టుకోల్పోయింది. ఈ క్రమంలోనే మరో బ్యాటర్ హర్‌ప్రీత్ బ్రార్(21)తో కలిసి 8వ వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. మ్యాచ్ మొత్తం పంజాబ్ చేతుల్లోకి వచ్చిందనగా బంతిని అందుకున్న గెరాల్డ్.. అశుతోష్(61; 28 బంతుల్లో 7 సిక్సులు, 2 ఫోర్లు)ను అవుట్ చేసి.. ముంబైకి భారీ ఊరటనిచ్చాడు. 17.1వ ఓవర్లో నబీకి క్యాచ్ ఇచ్చిన అశుతోష్ పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై విజయం లాంఛనమే అయిపోయింది. 183 పరుగులకే ఆలౌట్ అయిన పంజాబ్.. వరుసగా హ్యాట్రిక్ ఓటమిని ఖాతాలో వేసుకుంది.
దంచికొట్టిన సూర్య
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(8) స్వల్ప స్కోరుకే రబాడా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కలిసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి జోడీ 81 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ(36) సామ్ కరన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పటికే 34 బంతుల్లో రెండు సిక్సులు, ఐదు ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ చేసుకున్న సూర్య.. తర్వాత వచ్చిన తిలక్ వర్మతోనూ కలిసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లతో చెలరేగుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే, తన వ్యక్తిగత స్కోరు 78(53 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సులు) వద్ద సామ్ కరన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 148 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. తర్వాతి బ్యాటర్లు అంతగా రాణించకపోయినా తిలక్ వర్మ (34 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడి, జట్టు స్కోరును 192కు చేర్చాడు.
స్కోరు బోర్డు
ముంబై ఇండియన్స్: 192/7 (20ఓవర్లు)
ఇషాన్ కిషన్ (సి) హర్‌ప్రీత్ బ్రార్ (బి) రబాడా 8, రోహిత్ శర్మ (సి) హర్‌ప్రీత్ బ్రార్ (బి) సామ్ కరన్ 36, సూర్యకుమార్ (సి) ప్రభుసిమ్రాన్ (బి) సామ్ కరన్ 78, తిలక్ వర్మ 34 నాటౌట్; హార్దిక్ పాండ్యా (సి) హర్‌ప్రీత్ బ్రార్ (బి) హర్షల్ పటేల్ 10, టిమ్ డేవిడ్ (సి) సామ్ కరన్ (బి) హర్షల్ పటేల్ 14, రొమారియో షెఫార్డ్ (సి) శశాంక్ సింగ్ (బి) హర్షల్ పటేల్ 1, నబీ 0 రనౌట్(హర్షల్ పటేల్); ఎక్స్‌ట్రాలు-11
వికెట్ల పతనం: 18-1, 99-2, 148-3, 167-4, 190-5, 192-6, 192-7
బౌలింగ్: లివింగ్‌స్టోన్ (2-0-16-0), అర్షదీప్ సింగ్ (3-0-35-0), రబాడా (4-0-42-1), హర్షల్ పటేల్ (4-0-31-3), సామ్ కరన్ (4-0-41-2), హర్‌ప్రీత్ బ్రార్ (3-0-21-0)
పంజాబ్ కింగ్స్: 183/10 (19.1 ఓవర్లు)
సామ్ కరన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 6, ప్రభుసిమ్రాన్ (సి) ఇషాన్ కిషన్ (బి) గెరాల్డ్ 0, రిలీ రస్సో (బి) బుమ్రా 1, లివింగ్‌స్టోన్ (సి అండ్ బి) గెరాల్డ్ 1, హర్‌ప్రీత్ సింగ్ (సి అండ్ బి) శ్రేయస్ గోపాల్ 13, శశాంక్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 41, జితేశ్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) ఆకాశ్ మధ్వాల్ 9, అశుతోష్ శర్మ (సి) నబీ (బి) గెరాల్డ్ 61, హర్‌ప్రీత్ బ్రార్ (సి) నబీ (బి) హార్దిక్ 21, హర్షల్ పటేల్ 1 నాటౌట్ ; రబాడా 8 రనౌట్. ఎక్స్‌టాలు-21
వికెట్ల పతనం: 10-1, 13-2, 14-3, 14-4, 49-5, 77-6, 111-7, 168-8, 174-9, 183-10
బౌలింగ్: గెరాల్డ్ (4-0-32-3), బుమ్రా (4-0-21-3), ఆకాశ్ మధ్వాల్ (3.1-0-46-1), హార్దిక్ (4-0-33-1), శ్రేయస్ గోపాల్ (2-0-26-1), రొమారియో షెఫార్డ్ (2-0-20-0)