IPL 2023: కుర్రాళ్లు అదరగొట్టారోచ్.. ఐపీఎల్-16లో యువ క్రికెటర్లదే హవా

by Vinod kumar |
IPL 2023: కుర్రాళ్లు అదరగొట్టారోచ్.. ఐపీఎల్-16లో యువ క్రికెటర్లదే హవా
X

న్యూఢిల్లీ : ఐపీఎల్.. యువ క్రికెటర్లు టాలెంట్ నిరూపించుకోవడానికి కుర్రాళ్లకు చక్కటి వేదిక. ఇక్కడ సత్తాచాటితే చాలు జాతీయ జట్టులో చోటు దక్కడం ఖాయమే. గతంలో చాలా మంది కుర్రాళ్లు భారత టీ20 లీగ్‌లో అదరగొట్టి జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నారు. ఐపీఎల్-16లోనూ తమ సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పిన వాళ్లు ఉన్నారు. ఈ సీజన్‌లో తమ ఆటతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..

రింకు సింగ్: ఐపీఎల్-16‌లో ఎక్కువగా చర్చ జరిగింది ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడే గురించే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రింకు సింగ్ ఈ సీజన్‌లో పర్‌ఫెక్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. ఒకే ఒక మ్యాచ్‌‌తో అతని పేరు మారుమోగిపోయింది. గుజరాత్‌ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చిన అతని ఆట తీరు అందరిని కట్టిపడేసింది. చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లతో కోల్‌కతా‌ను గెలిపించాడు. అతని విధ్వంసం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. హైదరాబాద్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతేకాకుండా, కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా తరఫున అత్యధిక పరుగులు చేసింది కూడా అతనే. 14 మ్యాచ్‌ల్లో 149.52 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు.

యశస్వి జైస్వాల్‌ : ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అనగానే యశస్వి జైశ్వాల్ గుర్తొస్తాడు. ఈ యువ ఓపెనర్‌ ఈ సీజన్‌లో తనదైన ముద్ర వేశాడు. లీగ్ ప్రారంభానికి ముందే దేశవాళీలో అదరగొట్టిన జైశ్వాల్.. రాజస్థాన్ తనపై తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. పవర్ ప్లేలో అతని చూడచక్కని షాట్లు క్రికెట్ అభిమానులు ఓ రేంజ్‌‌లో అలరించాయి. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అతను వ్యక్తిగత అత్యధిక స్కోరు 124. అలాగే, ఐపీఎల్ చరిత్రలో 13 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకుని ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నెలకొల్పాడు. అలాగే, ఈ సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా అతన్నే వరించింది. అంతేకాకుండా, డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు టీమ్ ఇండియా స్టాండ్ బై ప్లేయర్‌గానూ ఎంపికయ్యాడు.

తిలక్‌ వర్మ: ఈ సీజన్‌లో తనదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో తిలక్ వర్మ కూడా ఉంటాడు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ వంటి స్టార్లు ఉన్నా.. ఈ హైదరాబాద్ కుర్రాడు మాత్రం ప్రత్యేకంగా నిలిచాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 46 బంతుల్లో 84 పరుగులతో సత్తాచాటిన తిలక్.. ఆ తర్వాత కూడా పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సొంతగడ్డపై హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 17 బంతుల్లో 37 పరుగులతో రాణించాడు. మొత్తంగా 11 మ్యాచ్‌ల్లో 342 పరుగులు చేశాడు. దాంతో అతను ముంబై జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు.

తుషార్‌ దేశ్‌పాండే : ఈ సీజన్‌లో అన్‌క్యాప్డ్ బౌలర్లలో అదరగొట్టిన లిస్ట్‌లో చెన్నయ్ యువ పేసర్ ముందు వరుసలో ఉన్నాడు. ముంబైకి చెందిన అతను ఈ సీజన్‌లో చెన్నయ్ బౌలింగ్ దళంలో కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నో బాల్స్, అదనపు పరుగులతో ఇబ్బంది పడిన తుషార్.. ఆ తర్వాత ధోనీ సారథ్యంలో రాటు దేలాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసుకున్నాడు. చెన్నయ్ తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలవడంతోపాటు టాప్ బౌలర్ల జాబితాలోనూ ఆరో స్థానంలో ఉన్నాడు.

సాయి సుదర్శన్‌ : గుజరాత్ టైటాన్స్ జట్టులో నిలకడగా రాణించాడు ఈ చెన్నయ్ బ్యాటర్. ఈ సీజన్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సత్తాచాటిన సాయి సుదర్శన్.. మరుసటి మ్యాచ్‌లోనే మరో అర్ధ సెంచరీ కొట్టాడు. అంతేకాకుండా, లీగ్ మొత్తం నిలకడగా రాణిస్తూ గుజరాత్‌ టపార్డర్‌లో కీలకంగా వ్యవహరించాడు కూడా. ముంబైతో జరిగిన క్వాలిఫయర్-2లో 43 పరుగులతో రాణించిన అతను.. ఫైనల్‌లో గిల్ త్వరగానే అవుటైన వేళ జట్టు భారీ స్కోరు సాధించిందంటే కారణం సాయి సుదర్శనే. 204 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగిన అతను 47 బంతుల్లో 96 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సాయి సుదర్శన్ 362 పరుగులు చేశాడు.

Advertisement

Next Story