IPL 2023: రాజస్థాన్‌ జోరుకు లక్నో కళ్లెం వేసేనా?.. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో ఢీ

by Vinod kumar |   ( Updated:2023-04-18 18:45:56.0  )
IPL 2023: రాజస్థాన్‌ జోరుకు లక్నో కళ్లెం వేసేనా?.. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో ఢీ
X

జైపూర్: ఐపీఎల్-16లో రాజస్థాన్ రాయల్స్ జోరు కనబరుస్తున్నది. పటిష్టమైన బ్యాటింగ్ దళమున్న ఆ జట్టుకు ఈ సీజన్‌లో ఎదురులేకుండా పోయింది. మరోవైపు, లక్నో జట్టు కూడా అటు ఇటుగా బలంగానే కనిపిస్తున్నది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండగా.. లక్నో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ రెండు జట్లు నేడు జైపూర్ వేదికగా తలపడబోతున్నాయి. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, హెట్మేయర్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ దళం మిగతా జట్లతో పోలిస్తే పవర్‌ఫుల్‌గా ఉంది. పడిక్కల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ సైతం టచ్‌లో ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. బౌలింగ్ పరంగా రాజస్థాన్ స్పిన్నర్లనే నమ్ముకుంది.


అశ్విన్, యుజువేంద్ర చాహల్‌ ఫామ్‌లో ఉండగా.. పేసర్లు బౌల్ట్, హోల్డర్ సైతం మంచి ప్రదర్శననే ఇస్తున్నారు. దాంతో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రాజస్థాన్ పటిష్టంగా కనిపిస్తుంది. మరోవైపు, లక్నో పరిస్థితి మరోలా ఉన్నది. ఆ జట్టులో బ్యాటింగ్ దళంలో నిలకడలేమి కనిపిస్తున్నది. ఆరంభంలో రెచ్చిపోయిన కైల్ మేయర్స్ గత మూడు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ అందుకున్నా ధాటిగా ఆడలేకపోతున్నాడు. పూరన్, స్టోయినిస్ మెరుపులు ఒక మ్యాచ్‌కే పరిమితమయ్యాయి. నేటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను తట్టుకుని నిలబడాలంటే లక్నో బ్యాటింగ్ పరంగా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. మార్క్‌వుడ్, అవేశ్ ఖాన్, యుద్విర్ సింగ్, గౌతమ్, బిష్ణోయ్, కృనాల్ పాండ్యా వంటి బౌలర్లతో బౌలింగ్ పరంగా లక్నో బలంగా ఉన్నది.

Advertisement

Next Story