IPL 2023: రింకు బిగ్ హిట్టర్.. గత సీజన్‌లోనూ మెరిసిన యూపీ డైనమెట్

by Vinod kumar |
IPL 2023: రింకు బిగ్ హిట్టర్.. గత సీజన్‌లోనూ మెరిసిన యూపీ డైనమెట్
X

న్యూఢిల్లీ: రింకు సింగ్.. గుజరాత్‌పై అతని సంచలన ఇన్నింగ్స్ అమోఘం.చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లతో కోల్‌కతాను గెలిపించిన తీరు అద్భుతం. నరేంద్ర మోడీ స్టేడియంలో అతను సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సగటు క్రికెట్ అభిమాని నుంచి దిగ్గజ క్రికెటర్ల వరకు తన ఇన్నింగ్స్‌తో ఫిదా చేశాడు. అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే, పేద కుటుంబంలో జన్మించిన రింకు సింగ్.. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. ఒకప్పుడు కుటుంబానికి ఆసరాగా నిలిచించేందుకు స్వీపర్‌గా టేబుళ్లు తుడిచిన అతను.. స్టార్ క్రికెటర్‌గా మారడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌‌‌కు చెందిన రింకు సింగ్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అలీగఢ్‌ ప్రాంతానికి చెందిన ఖాంచంద్ సింగ్, వీణ దంపతులకు మూడో సంతనం రింకు సింగ్. రింకు తండ్రి ఖాంచంద్ సింగ్ గ్యాస్ సిలిండర్లను సైకిల్‌పై ఇంటిఇంటికీ డెలివరీ చేస్తుంటాడు. గ్యాస్ సిలిండర్ గోడౌన్‌కు దగ్గర్లో శిథిలావస్థలో ఉన్న రెండు రూంల ఇంటిలో వాళ్లు ఉండేవారు. ఇప్పటికీ వారు అక్కడే ఉంటున్నారు. రింకు‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. అయితే, మొదట్లో రింకు క్రికెట్ ఆడటం అతని తండ్రికి ఇష్టం ఉండేది కాదు. బాగా చదువుకుని ఉద్యోగం సాధించాలని తన తండ్రి తనతో ఎప్పుడూ చెబుతుండేవాడని రింకు తెలిపాడు.

అయితే, ఒక టోర్నీలో రింకు అద్భుతంగా ఆడి బహుమతిగా బైక్‌ను గెలుచుకున్నాడు. అప్పటి నుంచి రింకుకు తండ్రి ప్రోత్సాహం కూడా దొరికింది. అయితే, బీద కుటుంబం కావడంతో ఆర్థిక కష్టాలు రింకును వెంటాడాయి. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు రింకు సింగ్ ఓ కోచింగ్ సెంటర్‌లో స్వీపర్‌‌గా కూడా పనిచేశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి తాను క్రికెట్‌‌లోనే అదృష్టం పరీక్షించుకుంటానని తన తల్లికి చెప్పాడు.

అప్పటి నుంచి తీవ్రంగా కష్టపడ్డాడు. 16ఏళ్ల వయసులో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రింకు సింగ్.. 2014‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016లో రంజీ ట్రోఫీకి ఎంపికైన అతను.. 2018 ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2, 875 పరుగులు, 50 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 1,749 పరుగులు, 78 టీ20ల్లో 1, 392 పరుగులు చేశాడు.

కోల్‌కతాలో చేరిక టర్నింగ్ పాయింట్..

దేశవాళీలో రాణిస్తున్న రింకు సింగ్‌‌కు 2017లోనే ఐపీఎల్‌‌లో ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ అతని తీసుకున్నప్పటికీ.. ఆ సీజన్‌లో అతనికి ఆడే చాన్స్ దక్కలేదు. 2018 వేలంలో కోల్‌కతా నైట్ ‌రైడర్స్ అతన్ని రూ. 80 లక్షలకు సొంతం చేసుకుంది. కేకేఆర్ చేరిక రింకు కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. కోల్‌కతా ట్రైనింగ్ సెషన్స్‌లో అతను మరింత రాటుదేలాడు. అయితే, 2018లో బెంగళూరుపై లీగ్‌లోకి అరంగేట్రం చేసినా ఆ మ్యాచ్‌తోపాటు సీజన్‌లో నిరాశపరిచాడు. ఆ తర్వాత 2019, 2020 ఎడిషన్లలో అడపాదడపా తుది జట్టులో చోటు దక్కినా నిరూపించుకోలేకపోయాడు. 2021లో గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. కానీ, రింకు సింగ్‌పై కోల్‌కతా మేనేజ్‌మెంట్ నమ్మకముంచింది. గత సీజన్లుగా అతన్ని రిటైన్ చేసుకుంది.

గతేడాదే మెరుపులు..

గాయం నుంచి కోలుకున్న తర్వాత రింకు సింగ్ గత సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా ట్రైనింగ్ సెషన్‌లో తీవ్రంగా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ప్రతిఫలం గతేడాది దక్కింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులతో పర్వాలేదనిపించి జట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడినా.. రస్సెల్ తర్వాత రింకు చేసినవే టాప్ స్కోర్. అనంతరం రాజస్థాన్‌పై 23 బంతుల్లో 42 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అతను సిక్స్‌ల మోత మోగించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 15 బంతుల్లో 4 సిక్స్‌లు 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.

చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. రింకు సింగ్ తొలి మూడు బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది లక్నో జట్టుకు చెమలు పట్టించాడు. అయితే, ఐదో బంతికి అతను అవుట్ కావడంతో కేకేఆర్ 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అదే జోరును ఈ సారి సీజన్‌లోనూ రింకు కనబరిచాడు. బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచ్‌లో 46 పరుగులు చేసిన అతను శార్దూల్‌తో కలిసి 103 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా విధ్వంసమే సృష్టించి ఓడిపోయే మ్యాచ్‌లో కేకేఆర్‌ను గెలిపించాడు. రింకు లాంటి బిగ్ హిట్టర్‌తో కోల్‌కతా జట్టుకు ఫినిషర్‌ రోల్ దొరికినట్టైంది.

Advertisement

Next Story