SRH పై GT గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టు..

by Mahesh |
SRH పై GT గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టు..
X

అహ్మదాబాద్: శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించాడు. దీంతో సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. హైదరాబాద్ అధికారికంగా నిష్ర్కమించింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. తర్వాత సన్‌రైజర్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టు బౌలర్ భువనేశ్వర్ కుమార్ 5 వికెట్ల ఘనత సాధించాడు. గుజరాత్ జట్టులో షమీ, మోహిత్ శర్మ చెరి నాలుగు వికెట్లు తీసుకున్నారు.

పవర్ ప్లే లో నాలుగు వికెట్లు

ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ రెండో బంతికి అన్‌మోల్‌ప్రీత్ సింగ్‌కు లైఫ్ లభించింది. అన్‌మోల్ ఇచ్చిన క్యాచ్‌ను తొలి స్లిప్ స్థానంలో ఉన్న తెవాటియా చేజార్చాడు. సాధారణంగా లైఫ్ లభించిన బ్యాటర్ ఆ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అన్‌మోల్ ఆ లైఫ్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. షమీ వేసిన నాలుగో బంతికి బౌండరీ కొట్టిన అన్‌మోల్ తర్వాత బంతికి భారీ షాట్ కొట్టబోయాడు. బంతి గాల్లోకి లేవడంతో డీప్ థర్డ్ మ్యాన్ స్థానంలో ఉన్న రషీద్ పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టాడు. తర్వాత రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్‌కు దిగాడు.

అయితే రెండో ఓవర్లో తొలి బంతికి బౌండరీ కొట్టిన అభిషేక్ శర్మ నాలుగు బంతికి కవర్ డ్రైవ్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి కీపర్ సాహా చేతిలోకి వెళ్లింది. తర్వాత కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ బరిలోకి దిగాడు. అయితే ఆ మరుసటి ఓవర్లోనే త్రిపాఠి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో హైదరాబాద్ జట్టు మూడు ఓవర్లలో 17 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన క్లాసెన్.. మార్‌క్రమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దుతాడని అందరూ అనుకున్నారు. ఐదో ఓవర్లో షమీ వేసిన రెండో బంతికి మార్‌క్రమ్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన సన్వీర్ సింగ్ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది.

క్లాసెన్ అర్ధ సెంచరీ

తర్వాతి ఓవర్లో తొలి బంతికే సన్వీర్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన అబ్దుల్ సమద్ మూడో బంతికి ఫోర్ కొట్టి ఐదో బంతికి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన మార్కో జెన్సెన్.. క్లాసెన్‌తో కలిసి నెమ్మదిగా ఆడాడు. అయినప్పటికీ మర్కో జాన్సెస్‌ను మోహిత్ శర్మ పెవిలియన్ పంపాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లో క్లాసెన్ వరుసగా ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు. తర్వాత వచ్చిన భువనేశ్వర్.. క్లాసెన్‌తో కలిసి స్కోరును 100 పరుగులు దాటించాడు. 14వ ఓవర్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ మరో రెండో ఓవర్ల తర్వాత అవుటయ్యాడు. తర్వాత మయాంక్ మార్కండే వచ్చాడు. కానీ 19వ ఓవర్లో భువనేశ్వర్ వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన ఫారూఖీ, మార్కండే నాటౌట్‌గా నిలవడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.

గిల్ ఒంటరి పోరు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఆరంభంలోనే దెబ్బ తినింది. ఇన్నింగ్స్ మూడో బంతికే వృద్ధిమాన్ సాహా డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్‌లో పుల్ శాట్ ఆడాడు.. డ్రైవ్ కొట్టాడు.. ఫ్లిక్ చేశాడు.. మొత్తానికి నాలుగు బౌండరీలు సాధించాడు. సుదర్శన్, గిల్ ఇద్దరూ బౌండరీలు బాదడంతో ఆరు ఓవర్ల పవర్ ప్లేలో గుజరాత్ జట్టు 65 పరుగులు చేసింది. తర్వాత కూడా గిల్ తన దాడిని కొనసాగించాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ జట్టు 1 వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా సుదర్శన్, గిల్ కలిసి ప్రత్యర్థి బౌలింగ్‌ను చితకబాదడంతో 14వ ఓవర్ వరకు రన్‌రేట్ 10 ఉండింది. చివరికి సుదర్శన్ 15వ ఓవర్లో అవుటయ్యాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న గిల్ దాడి కొనసాగింది. 19వ ఓవర్లో రెండో బంతికి గిల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

భళా భువనేశ్వర్

గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. తర్వాత డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, డాసన్ షనక సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 186 పరుగుల వద్ద మూడు వికెట్లు పడ్డాయి. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ డకౌట్‌గా వెనుదిరిగారు. నూర్ అహ్మద్ రనౌట్ కాగా.. మిగిలిన ఇద్దరు భువనేశ్వర్ బౌలింగ్‌లో అవుటయ్యారు. మోహిత్ శర్మ నాటౌట్‌గా నిలవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది.

స్కోరుబోర్డు

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వృద్ధిమాన్ సాహా (సి) అభిషేక్ (బి) భువనేశ్వర్ 0, శుబ్‌మన్ గిల్ (సి) అబ్దుల్ సమద్ (సి) భవనేశ్వర్ 101, సాయి సుదర్శన్ (సి) నటరాజన్ (బి) జాన్సెన్ 47, హర్దిక్ పాండ్య (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్ 8, డేవిడ్ మిల్లర్ (సి) మార్‌క్రమ్ (బి) నటరాజన్ 7, రాహుల్ తెవాటియా (సి) జాన్సెన్ (బి) ఫారూఖీ 3, డాసన్ శనక నాటౌట్ 9, రషీద్ ఖాన్ (సి) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 0, నూర్ అహ్మద్ రనౌట్ 0, మహ్మద్ షమీ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0, మోహిత్ శర్మ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 188/9; వికెట్ల పతనం: 1-0, 2-147, 3-156, 4-169, 5-175, 6-186, 7-186, 8-186, 9-187; బౌలింగ్: భువనేశ్వర్: 4-0-30-5, మార్కో జెన్సెన్: 4-0-39-1, ఫజల్‌హక్ ఫారూఖీ: 3-0-31-1, నటరాజన్: 4-0-34-1, ఐడెన్ మార్‌క్రమ్: 1-0-13-0, మయాంక్ మార్కండే: 3-0-27-0, అభిషేక్ శర్మ: 1-0-13-0.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (సి) రషీద్ ఖాన్ (బి) మహ్మద్ షమీ 5, అభిషేక్ శర్మ (సి) సాహా (బి) యష్ దయాల్ 5, ఐడెన్ మార్‌క్రమ్ (సి) శనక (బి) షమీ 10, హెన్రిచ్ క్లాసెన్ (సి) మిల్లర్ (బి) షమీ 64, సన్వీర్ సింగ్ (సి) సాయి సుదర్శన్ (బి) మోహిత్ శర్మ 7, అబ్దుల్ సమద్ (సి) శివం మవి (బి) మోహిత్ శర్మ 4, మార్కో జెన్సెన్ (సి) పాండ్య (బి) మోహిత్ శర్మ 3, భువనేశ్వర్ కుమార్ (సి) రషీద్ ఖాన్ (బి) మోహిత్ శర్మ 27, మయాంక్ మార్కండే నాటౌట్ 18, ఫజల్‌హక్ ఫారూఖీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 154/9; వికెట్ల పతనం: 1-6, 2-11, 3-12, 4-29, 5-45, 6-49, 7-59, 8-127, 9-147; బౌలింగ్: మహ్మద్ షమీ: 4-0-21-4, యష్ దయాల్: 4-1-31-1, రషీద్ ఖాన్: 4-0-28-0, మోహిత్ శర్మ: 4-0-28-4, నూర్ అహ్మద్: 2.5-0-35-0, రాహుల్ తెవాటియా: 1.1-0-7-0.

Advertisement

Next Story

Most Viewed