రోహిత్‌ శర్మకు ప్రీతి జింటా ఆఫర్ ఇచ్చింది నిజమేనా?

by Harish |
రోహిత్‌ శర్మకు ప్రీతి జింటా ఆఫర్ ఇచ్చింది నిజమేనా?
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడతాడని, వచ్చే సీజన్‌కు ముందు జరిగే మెగా వేలంలో అతను పాల్గొంటాడని ప్రచారం జరుగుతోంది. అది జరిగితే హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడతాయనడంలో సందేహం లేదు. ఇటీవల పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా మెగా వేలంలో రోహిత్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ‘మా జట్టులో స్థిరత్వాన్ని తీసుకొచ్చే చాంపియన్‌ మైండ్‌సెట్‌ ఉన్న కెప్టెన్‌ను మిస్ అవుతున్నాం. కాబట్టి, ఒకవేళ రోహిత్ మెగా వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసేందుకు ఎంతకైనా వెళ్తాం.’ అని ప్రీతి జింటా వ్యాఖ్యానించినట్టు పలు కథనాలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలను ప్రీతి జింటా కొట్టిపారేసింది. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె.. ఆ వార్తలను ఫేక్ అని స్పష్టం చేసింది. ‘రోహిత్ శర్మను నేను చాలా గౌరవిస్తాను. అతనికి పెద్ద అభిమానిని కూడా. కానీ, నేను అతనితో చర్చించలేదు. ఏ ఇంటర్వ్యూలోనూ ఏ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. శిఖర్ ధావన్ అంటే నాకు చాలా గౌరవం. ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే తప్పుడు సమాచారం ఎలా సేకరించబడుతుందో, సోషల్ మీడియాలో ఎలా ప్రచారం జరుగుతుందో చెప్పడానికి ఈ ఆర్టికల్సే ఉదాహరణ. ఇలాంటి వార్తలను ప్రసారం చేయడం మానుకోవాలని మీడియాను కోరుతున్నా. మాకు గొప్ప జట్టు ఉంది. మ్యాచ్‌లు గెలవడంపైనే మా ఫోకస్ ఉంటుంది.’ అని ప్రీతి జింటా రాసుకొచ్చింది.

Advertisement

Next Story