గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన చెన్నయ్.. వరుసగా రెండో విజయం

by Harish |
గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన చెన్నయ్.. వరుసగా రెండో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం చెన్నయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 63 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నయ్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు 206/6 చేసింది. శివమ్ దూబె(51) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రచిన్ రవీంద్ర(46), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(46) సైతం సత్తాచాటారు. బ్యాటుతో బెంబేలెత్తించిన చెన్నయ్ బంతితోనూ మెరిసింది. దీంతో ఛేదనకు దిగిన గుజరాత్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 143/8 స్కోరుకే పరిమితమైంది. సాయి సుదర్శన్(37) టాప్ స్కోరర్. చెన్నయ్ బౌలర్లు సమిష్టిగా రాణించి గుజరాత్‌ను కట్టడి చేశారు. అర్ధ సెంచరీతో మెరిసిన దూబె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

తడబడిన గుజరాత్

207 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఇన్నింగ్స్ మొదటి నుంచి చివరి వరకు తడబడుతూనే సాగింది. చెన్నయ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు ఎదురుదాడికి దిగలేకపోయారు. ఓపెనర్, కెప్టెన్ గిల్(8) నిరాశపర్చగా.. కాసేపు ధాటిగా ఆడిన వృద్ధిమాన్ సాహా(21) కూడా క్రీజులో నిలువలేకపోయాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్(37) ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత మీదేసుకున్నాడు. అయితే, మరో ఎండ్‌లో అతనికి సహకారం కరువైంది. విజయ్ శంకర్(12), డేవిడ్ మిల్లర్(21) స్వల్ప స్కోరుకే అవుటవ్వగా.. కాసేపటి తర్వాత సుదర్శన్ కూడా వెనుదిరిగాడు. ఆ సమయానికి 114/5 స్కోరుతో నిలిచిన గుజరాత్ ఆ తర్వాత కూడా కోలుకోలేదు. అజ్మతుల్లా(11), రషీద్ ఖాన్(1), రాహుల్ తెవాటియా(6) వికెట్లు పారేసుకున్నారు. ఉమేశ్ యాదవ్(10 నాటౌట్), జాన్సన్(5 నాటౌట్) వికెట్లు కాపాడుకోవడంతో గుజరాత్ ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడినా.. 150 పరుగుల్లోపే పరిమితమైంది. చెన్నయ్ బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లు తీయగా.. మిచెల్, పతిరణకు చెరో వికెట్ దక్కింది.

దూబె, రచిన్ రవీంద్ర మెరుపులు

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నయ్‌కు ఓపెనర్ రచిన్ రవీంద్ర(46) అదిరిపోయే ఆరంభం అందించాడు. గుజరాత్ బౌలర్లపై విరుచుకపడిన అతను ఎడాపెడా బౌండరీలు బాదడంతో 5 ఓవర్లలో సీఎస్కే 58/0తో నిలిచింది. అయితే, అతని దూకుడుకు రషీద్ ఖాన్ 6వ ఓవర్‌లో చెక్ పెట్టాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన అతను తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం అజింక్యా రహానే(12) సహకారంతో రుతురాజ్ గైక్వాడ్ దూకుడుగా ఆడాడు. దీంతో 10 ఓవర్లలో చెన్నయ్ జట్టు 100 పరుగుల మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో రహానే‌తోపాటు హాఫ్ సెంచరీకి చేరువైన గైక్వాడ్‌(46) స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో గుజరాత్ బౌలర్లు పుంజుకునేలా కనిపించారు. అయితే, వారికి శివమ్ దూబె అవకాశం ఇవ్వలేదు. మరోసారి చెలరేగిన అతను అలవోకగా సిక్స్‌లు బాదుతూ బౌలర్ల భరతం పట్టాడు. ఈ క్రమంలో చూస్తుండగానే 22 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లోనే దూబె అవుటయ్యాడు. ఇక, చివరి ఓవర్‌లో సమీర్ రిజ్వి(14), జడేజా(7) అవుటవ్వగా.. ఆ ఓవర్‌లో 8 పరుగులు రావడంతో స్కోరు 200 పరుగుల మార్క్‌ను దాటింది. డారిల్ మిచెల్(24 నాటౌట్) అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ 2 వికెట్లు తీయగా.. సాయి కిశోర్, జాన్సన్, మోహిత్ చెరో వికెట్ పడగొట్టారు.

స్కోరుబోర్డు

చెన్నయ్ సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 206/6(20 ఓవర్లు)

రుతు‌రాజ్ గైక్వాడ్(సి)సాహా(బి)జాన్సన్ 46, రచిన్ రవీంద్ర(స్టంప్)సాహా(బి)రషీద్ 46, రహానే(స్టంప్)సాహా(బి)సాయి కిశోర్ 12, శివమ్ దూబె(సి)విజయ్ శంకర్(బి)రషీద్ 51, మిచెల్ 24 నాటౌట్, సమీర్ రిజ్వి(సి)మిల్లర్(బి)మోహిత్ 14, జడేజా 7 రనౌట్(విజయ్ శంకర్/సాహా) 7; ఎక్స్‌ట్రాలు 6

బౌలింగ్ : 62-1, 104-2, 127-3, 184-4, 199-5, 206-6

బౌలింగ్ : అజ్మతుల్లా(3-0-30-0), ఉమేశ్(2-0-27-0), రషీద్(4-0-49-2), సాయి కిశోర్(3-0-28-1), జాన్సన్(4-0-35-1), మోహిత్(4-0-36-1)

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 143/8(20 ఓవర్లు)

సాహా(సి)తుషార్ దేశ్‌పాండే(బి)చాహర్ 21, గిల్ ఎల్బీడబ్ల్యూ(బి)చాహర్ 8, సుదర్శన్(సి)సమీర్(బి)పతిరణ 37, విజయ్ శంకర్(సి)ధోనీ(బి)మిచెల్ 12, మిల్లర్(సి)రహానే(బి)తుషార్ దేశ్‌పాండే 21, అజ్మతుల్లా(సి)రచిన్ రవీంద్ర(బి)తుషార్ దేశ్‌పాండే 11, రాహుల్ తెవాటియా(సి)రచిన్ రవీంద్ర(బి)ముస్తాఫిజుర్ 6, రషీద్ ఖాన్(సి)రచిన్ రవీంద్ర(బి)ముస్తాఫిజుర్ 1, ఉమేశ్ 10 నాటౌట్, జాన్సన్ 5 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.

వికెట్ల పతనం : 28-1, 34-2, 55-3, 96-4, 114-5, 118-6, 121-7, 129-8

బౌలింగ్ : దీపక్ చాహర్(4-0-28-2), ముస్తాఫిజుర్ రెహ్మాన్(4-0-30-2), తుషార్ దేశ్‌పాండే(4-0-21-2), జడేజా(2-0-15-0), మిచెల్(2-0-18-1), పతిరణ(4-0-29-1)

Advertisement

Next Story