బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన పాక్ బౌలర్?.. ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన అమెరికా క్రికెటర్

by Harish |
బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన పాక్ బౌలర్?.. ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన అమెరికా క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్‌పై అమెరికా బౌలర్ రస్టీ థెరాన్ సంచలన ఆరోపణలు చేశాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అతను బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని తెలిపాడు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాడు. ‘కొత్త బంతిని హారిస్ రవూఫ్ గీకుతూ కనిపించాడు. రెండు ఓవర్లు మాత్రమే వాడిన బంతిని రివర్స్ స్వింగ్ వేయడం సాధ్యమా?. హారిస్ రవూఫ్ పరిగెత్తేటప్పుడు బంతిని తన బొటనవేలితో రుద్దడాన్ని చూడొచ్చు.’ అని ట్వీట్ చేశాడు. ఆ పోస్టుకు ఐసీసీని ట్యాగ్ చేశాడు.

అమెరికా ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌లో తొలి బంతికి ఆండ్రీస్ గౌస్‌ను రవూఫ్ గ్రీన్ బౌల్డ్ చేశాడు. రివర్స్ స్వింగ్ అయిన బంతి వికెట్లను కొట్టేసింది. 13 ఓవర్ ప్రారంభానికి కంటే ముందు పాకిస్తాన్ కొత్త బంతితో బౌలింగ్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే కొత్త బంతితో రివర్స్ స్వింగ్ చేయడం ఎలా సాధ్యమవుతుందని రస్టీ థెరాన్ ప్రశ్నించాడు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. బాల్ టాంపరింగ్ చేయడంతో పాక్ కొత్త కాదని పాత వీడియోలను పోస్టు చేస్తున్నారు. కాగా, ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అమెరికా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో అమెరికా విజయం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed