T20 World Cup : టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ

by Harish |
T20 World Cup : టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ వేటను మొదలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ను చిత్తు చేసి బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన గ్రూపు ఏ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌.. భారత పేసర్ల ధాటికి 16 ఓవర్లలోనే కుప్పకూలింది. 96 పరుగులకే ఆలౌటైంది. డెలానీ(26) టాప్ స్కోరర్. ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హార్దిక్ పాండ్యా(3/27), బుమ్రా(2/6), అర్ష్‌దీప్ సింగ్(2/35) నిప్పులు చెరిగే బంతులతో ఐర్లాండ్ పతనాన్ని శాసించారు. అనంతరం 97 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లే కోల్పోయి 12.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీ సత్తాచాటగా.. రిషబ్ పంత్(36 నాటౌట్) రాణించాడు.

మెరిసిన రోహిత్

ఐర్లాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమవడంతో తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ విజయం లాంఛనమైపోయింది. 97 పరుగులను ఛేదించడానికి టీమ్ ఇండియా ఎన్ని ఓవర్లు తీసుకుంటుందోనని మాత్రమే అభిమానులు ఎదురుచూశారు. అయితే, ఛేదనలో టీమ్ ఇండియాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ(1) నిరాశపరిచాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చెలరేగి ఆడాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో వికెట్ల మధ్య పరుగులు రాబడుతూనే.. ధాటిగా ఆడాడు. తొలి ఓవర్‌లోనే ఫోర్ కొట్టిన అతను.. జాషువా లిటిల్ వేసిన ఓవర్‌లో వరుసగా 4, 6 దంచాడు. అతనికి రిషబ్ పంత్ చక్కటి సహకారం అందించాడు. పవర్ ప్లే తర్వాత రెచ్చిపోయిన రోహిత్ జాషువా లిటిల్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ఫోర్ కొట్టిన అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, కాసేపటికే బంతి చేతికి తాకడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. రోహిత్ మైదానం వీడే సమయానికి భారత్ విజయానికి ఇంకా 21 పరుగులు కావాలి. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(2) నిరాశపర్చగా.. రిషబ్ పంత్(36 నాటౌట్) మిగతా పని పూర్తి చేశాడు.

చెలరేగిన భారత పేసర్లు

అంతకుముందు భారత పేసర్లు విజృంభించారు. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగగా.. ఐర్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. డెలానీ చేసిన 26 పరుగులే టాప్ స్కోర్ అంటే ఐర్లాండ్‌ను భారత బౌలర్లు ఏ విధంగా బెంబేలెత్తించారో అర్థం చేసుకోవచ్చు. మొదట అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో ఓపెనర్లు స్టిర్లింగ్(2), బల్బర్నీ(5)లను అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని మొదలుపెట్టాడు. బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా మరోసారి బంతితో చెలరేగాడు. లోర్కాన్ టకర్(10), కర్టిస్ కాంఫర్(12)లను పెవిలియన్ పంపాడు. దీంతో 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా ఆ జట్టును ఆదుకునే వారు కరువయ్యారు. బుమ్రా, సిరాజ్, అక్షర్ కూడా మెరవడంతో ఐదు పరుగుల వ్యవధిలోనే ఐర్లాండ్ మరో మూడు వికెట్లు కోల్పోయి 50/8తో ఆలౌట్ అంచున నిలిచింది. జాషువా లిటిల్(14)తో కలిసి డెలానీ కాసేపు పోరాడటంతో ఐర్లాండ్ 100 పరుగుల దిశగా వెళ్లింది. అయితే, బుమ్రా బౌలింగ్‌లో జాషువా లిటిల్ బౌల్డ్ అవ్వగా.. కాసేపటికే చివరి వికెట్‌గా డెలానీ రనౌటవడంతో ఐర్లాండ్ ఆట 16 ఓవర్లలోనే ముగిసింది. భారత బౌలర్లలో పాండ్యా 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా రెండేసి వికెట్లతో సత్తాచాటారు. సిరాజ్, అక్షర్ పటేలకు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

ఐర్లాండ్ ఇన్నింగ్స్ : 96 ఆలౌట్(16 ఓవర్లు)

బల్బిర్నీ(బి)అర్ష్‌దీప్ సింగ్ 5, స్టిర్లింగ్(సి)పంత్(బి)అర్ష్‌దీప్ సింగ్ 2, లోర్కాన్ టకర్(బి)పాండ్యా 10, హ్యారీ టెక్టర్(సి)కోహ్లీ(బి)బుమ్రా 4, కర్టిస్ కాంఫర్(సి)పంత్(బి)పాండ్యా 12, డాక్రెల్(సి)బుమ్రా(బి)సిరాజ్ 3, డెలానీ రనౌట్(సిరాజ్/పంత్) 26, మార్క్ అడైర్(సి)శివమ్ దూబె(బి)పాండ్యా 3, మెకార్తీ(సి అండ్ బి)అక్షర్ 0, జాషువా లిటిల్(బి)బుమ్రా 14, బెంజిమిన్ వైట్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 15.

వికెట్ల పతనం : 7-1, 9-2, 28-3, 36-4, 44-5, 46-6, 49-7, 50-8, 77-9, 96-10

బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్(4-0-35-2), సిరాజ్(3-0-13-1), బుమ్రా(3-1-6-2), పాండ్యా(4-1-27-3), అక్షర్(1-0-3-1), జడేజా(1-0-7-0)

Advertisement

Next Story

Most Viewed