టీ20 మహిళా వరల్డ్ కప్.. వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా బోణి!

by saikumar |
టీ20 మహిళా వరల్డ్ కప్.. వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా బోణి!
X

దిశ, స్పోర్ట్స్ : ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఎనిమిదేళ్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ద‌క్షిణాఫ్రికా వరల్డ్ కప్ వేటను ఘ‌నంగా ప్రారంభించింది. లీగ్ ద‌శలో జరిగిన తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియ‌న్ వెస్టిండీస్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుక్రవారం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండిస్ మధ్య తొలి మ్యాచ్ జరగగా.. ముందు బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా టీం.. క‌రీబియ‌న్లను వ‌ణికించింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లోనూ సఫారీలు సత్తాచాటారు. ఓపెన‌ర్లు లారా వొల్వార్డ్త్ (59 నాటౌట్‌), తంజిమ్ బిస్త్‌ (57 నాటౌట్‌) అర్ధ శ‌త‌కాల‌తో మెరిసారు. మెగా టోర్నీలో అద్భుత రికార్డు క‌లిగిన విండీస్ బౌల‌ర్లను ఉతికేస్తూ అజేయంగా జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చారు. ఈ ఇద్దరి విధ్వంసంతో స‌ఫారీలు ప్రపంచకప్ ఆరంభంలోనే అదిరే బోణీ కొట్టారు.

ఓపెనర్లదే హవా..

మాజీ చాంపియ‌న్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో తొలుత బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు.. క‌రీబియ‌న్ జ‌ట్టును త‌క్కువ స్కోర్‌కే క‌ట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ విధించిన 119 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్యాన్ని స‌ఫారీ జ‌ట్టు సులువుగా చేధించింది. ప‌వ‌ర్ ప్లేలో ఓపెన‌ర్ తంజిమ్ బ్రిస్ట్(57 నాటౌట్‌), కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (59 నాటౌట్‌)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆ త‌ర్వాత కూడా వీరిద్దరూ ఏమాత్రం తగ్గలేదు. బౌండ‌రీల‌తో చెలరేగి వెస్టిండీస్ బౌల‌ర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. దీంతో కరీబియ‌న్ కెప్టెన్ హీలీ మాథ్యూస్ బౌల‌ర్లను మ‌ర్చినా ఫ‌లితం లేక‌పోయింది. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో విండీస్‌ను ఒత్తిడిలో ప‌డేసిన లారా, బ్రిస్ట్‌లు జట్టుకు తొలి విజయాన్ని కట్టబెట్టారు. ఏకంగా 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. దీంతో ద‌క్షిణాఫ్రికా జట్టుకు రెండు పాయింట్లు వచ్చాయి.

సఫారీ బౌలర్లు భళా..

మ్యాచ్ ఆరంభంలో టాస్ ఓడిన వెస్టిండీస్‌ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 15 ప‌రుగుల‌కే ఆల్‌ రౌండ‌ర్ మ‌రిజానే కాప్ (2/14), ఓపెన‌ర్ హేలీ మాథ్యూస్‌(10) పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ త‌ర్వాత బౌలింగ్ చేసిన లెకో ల‌బా(4/29) మ‌రో ఓపెన‌ర్ క్వియానా జోసెఫ్ (4) ను వికెట్ తీసి విండీస్‌ను ఒత్తిడిలో ప‌డేసింది. అనంతరం స్టఫానీ టేల‌ర్(44), విధ్వంస‌క ఆల్‌రౌండ‌ర్ డియాండ్ర డాటిన్ (13)లు ధ‌నాధ‌న్ ఆడి జ‌ట్టును ఆదుకున్నారు. కానీ, మ‌రిజానే మ‌రోసారి జ‌ట్టుకు బ్రేక్‌ నిస్తూ డాటిన్‌ను ఔట్ చేసింది. దీంతో 62 ప‌రుగుల‌కే విండీస్ స‌గం వికెట్లు కోల్పోయి పీకల్లోతూ క‌ష్టాల్లో ప‌డింది. ఆ ద‌శ‌లో టేల‌ర్, జైదా (15 నాటౌట్)లు వరుస బౌండ‌రీలు బాది జట్టుకు గౌర‌వ‌ప్రద‌మైన స్కోర్ అందించారు.

Advertisement

Next Story