టాస్క్ కంప్లీట్.. హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌కు గొప్ప ముగింపు

by Harish |
టాస్క్ కంప్లీట్.. హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌కు గొప్ప ముగింపు
X

దిశ, స్పోర్ట్స్ : రాహుల్ ద్రవిడ్‌కు గొప్పు ముగింపు. టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్.. హెడ్ కోచ్‌గా అతని ఆఖరి మ్యాచ్ ఒక్కటే. హెడ్ కోచ్‌గా తన టాస్క్‌ను కంప్లీట్ చేశాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్‌తో భారత ప్రధాన కోచ్‌గా అతని పదవీకాలం ముగిసింది. వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత హెడ్ కోచ్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా, ద్రవిడ్ తన కెరీర్‌లో తొలి ప్రపంచకప్ గెలిచాడు. ఆటగాడిగా సాధించలేనిది.. కోచ్‌గా తన కలను నెరవేర్చుకున్నాడు.

రవిశాస్త్రి నుంచి ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 2021 నవంబర్‌లో ప్రధాన కోచ్‌గా నియామకమయ్యాడు. 2021 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు అతని హయాంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అదే సమయంలో జట్టుగా ఎంతో పరిణితి చెందింది. మొదట్లో ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరకపోవడం, టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్‌లోనే ఇంటిదారిపట్టడంతో ద్రవిడ్ కోచింగ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఆ తర్వాత ద్రవిడ్ గైడెన్స్‌లో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో ఫైనల్‌కు చేరింది. 12 నెలల్లో ఇది సాధ్యమవడం విశేషం. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్‌, గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది. ఆ రెండు సందర్భాల్లోనూ ఆసిస్ చేతిలోనే భారత్ పరాజయం పాలైంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అతని హయాంలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 17 టీ20 సిరీస్‌ల్లో 14 సిరీస్‌లను సొంతం చేసుకుంది. వన్డే ఫార్మాట్‌లో భారత్ 13 సిరీస్‌లు ఆడగా 10 దక్కించుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత్ నం.1 జట్టుగా కొనసాగుతోంది. టెస్టుల్లో ఆరు సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా నం.2 జట్టుగా ఉన్నది.



Next Story