నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు

by Kalyani |
నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు
X

దిశ, చేగుంట: వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలను కాజేసే ఉద్దేశంతో స్నేహం చేసి నగలు కాజేసి హత్య చేసిన దుండగులను శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి సాజు తండా కు చెందిన మాలోతు లలిత ఈనెల 11వ తేదీన మాసాయిపేట లో కెనరా బ్యాంకులో ఉపాధి హామీ డబ్బుల కోసం వచ్చి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తూప్రాన్ మండలం గన్ పూర్ గ్రామానికి చెందిన వల్లపు కనకయ్య, వల్లపు ప్రమీలలు కల్లు దుకాణంలో పరిచయమైన మాలోతు లలితతో మరింత స్నేహం పెంచుకొని నగలు కాజేయడం కోసం పక్కా ప్లాన్ అమలు చేశారు. యాదగిరిగుట్టకు దైవదర్శనం కోసం వెళ్దామని చెప్పి నగలు వేసుకొని రమ్మన్నారు.

ఈనెల 11వ తేదీన తూప్రాన్ కల్లు దుకాణంలో కలుసుకున్న వల్లపు కనకయ్య, వల్లపు ప్రమీల, మాలోతు లలితను బైక్ పై జగదేవ్ పూర్ మండలం పీర్ల పల్లి అటవీ ప్రాంతం లోకి తీసుకెళ్లి మద్యం సేవించారు. అనంతరం లలితను అతి దారుణంగా చంపి వంటిపై ఉన్న 60 తులాల వెండి, మూడు గ్రాముల బంగారం తీసుకొని మృతదేహాన్ని కాలబెట్టి తూప్రాన్ లో పాన్ బ్రోకర్ షాప్ లో దోచుకున్న వస్తువులను కుదువ పెట్టారు. అట్టి వాటికి 33 వేల రూపాయలు రాగా ఒక ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో రామాయంపేట రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి కృషి చేశారని అభినందించారు. అదేవిధంగా చేగుంట హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ భాస్కర్, ఘటేష్, రమేష్, హోంగార్డ్ హర్షద్ లను తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి అభినందించారు.

Next Story

Most Viewed