Woman Swimmer Adventure :సముద్రంలో మహిళ 150కిలోమీటర్ల సాహస స్విమ్మంగ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-04 05:48:27.0  )
Woman Swimmer Adventure :సముద్రంలో మహిళ 150కిలోమీటర్ల సాహస స్విమ్మంగ్
X

దిశ, వెబ్ డెస్క్ : చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పట్ల పెంచుకున్న ఇష్టం ఆమెను 52ఏండ్ల వయస్సులో సముద్రంలో 152కిలోమీటర్ల సాహస స్విమ్మింగ్(Adventure Swimming)ను పూర్తి చేసేలా చేసింది. సామర్ల కోటకు చెందిన స్విమ్మర్ గోలి శ్యామల(Female Swimmer Goli Shyamala) గత నెల 28న విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం(Visakhapatnam Beach to Kakinada Beach) వరకు కోరమండల్‌ ఒడిస్సీ ఓషన్‌ స్విమ్మింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో సాహస యాత్ర ప్రారంభించారు. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి.మీ ఈది (150km Adventure Swimming) కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి విజయవంతంగా చేరుకున్నారు. శ్యామలకు కాకినాడ రూరల్ సూర్యారావు పేట ఎన్టీఆర్ బీచ్‌లో ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ మున్సిపాల్ కమిషనర్ భావన, కాకినాడ సీపోర్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మురళీధర్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

గతంలో తమిళనాడు రామసేతు ప్రాంతంలో స్విమ్మింగ్ చేసిన శ్యామల తొలిసారిగా సుదూర లక్ష్యాన్ని నిర్థేశించుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సుదూర లక్ష్యాలను ఇప్పటిదాక పూర్తిచేసిన ఐదుగురిలో శ్యామల కూడా ఒకరని అధికారులు తెలిపారు. సముద్రంలో స్విమ్మింగ్ అనుభవాలపై శ్యామల మాట్లాడుతూ స్విమ్మింగ్ సమయంలో తాబేళ్లు దగ్గరగా వచ్చి వెళ్ళటం చూసి సంతోషపడ్డానని, సముద్ర జలాలు కలుషితం కావడంవల్ల తాబేలు మృత్యువాత పడిన దృశ్యాలు కూడా చూశానని, అది తనను కలచి వేసిందన్నారు. అక్కడక్కడ జెల్లీ చేపలు కొంచెం ఇబ్బంది పెట్టాయన్నారు.

జల కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తన సాహస స్విమ్మింగ్ కోసం శారీరకంగా రెండేళ్ల పాటు ఎంతో కసరత్తు చేశానన్నారు. సాహస యాత్రలో వెన్నంటి ఉండి ప్రోత్సహించిన రెడ్ క్రాస్ చైర్మన్ రామారావు, కే.ఎస్.పీ.ఎల్ ప్రతినిధి రామ్మోహన్, 14 మంది క్రూ సభ్యులు, వైద్యబృందం, స్కూబా డైవర్స్ వెంట వచ్చారని తెలిపారు. 2021లో రామసేతు, గత ఫిబ్రవరిలో లక్షద్వీప్ లో ఈది ఆసియాకు చెందిన మొదటి వ్యక్తిగా నిలిచానన్నారు.

Advertisement

Next Story

Most Viewed