కేబుల్ దొంగ హల్‌చల్.. రైతు చేతి వేళ్లను విరగ్గొట్టి మరి..

by Rajesh |
కేబుల్ దొంగ హల్‌చల్.. రైతు చేతి వేళ్లను విరగ్గొట్టి మరి..
X

దిశ, భిక్కనూరు : కేబుల్ దొంగతనానికి వచ్చిన యువకుడు తనను కట్టెతో బలంగా కొట్టాడన్న కోపంతో రైతు చెయ్యి విరిచి పరారైన ఉదాంతం బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భిక్కనూరు మండలం గుర్జ కుంట గ్రామ శివారులో గత కొద్ది రోజులుగా వ్యవసాయ బావుల వద్ద కేసింగ్ పైపులు, కేబుల్ వైర్లు, వ్యవసాయ పనిముట్లు అపహరించుకుపోతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్ద నిద్రలేని రాత్రులు గడుపుతున్నప్పటికీ తృటిలో తప్పించుకొని పారిపోతున్నారు.

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బాల రాంరెడ్డి అనే రైతు వ్యవసాయ భావి వద్ద కాపలా కాస్తుండగా, యువకుడు ఒకరు వచ్చి బోరు మోటర్ నుండి కేబుల్ వైర్‌ను రెండు చోట్ల కత్తిరించి, అపహరించేందుకు యత్నిస్తుండగా, ఈ విషయాన్ని గమనించిన సదరు రైతు పొలంలో నతికి ఉన్న దొంగ‌పై కట్టెతో దాడి చేశాడు. ఈ క్రమంలో కట్టె విరిగిపోవడం, మరో కట్టె కోసం చూస్తుండగా, ఇదే అదనుగా భావించిన కేబుల్ దొంగ వెనకాల నుంచి వచ్చి గట్టిగా రెండు చేతులు పట్టుకొని, ఒక చేతి వేళ్లను బలంగా వంచి విరిచేశాడు. దీంతో సదరు రైతు లబోదిబోమంటూ అరుపులు కేకలు పెట్టడంతో కేబుల్ దొంగ పరారయ్యాడు.

అయితే గాయపడిన రాంరెడ్డిని కుటుంబ సభ్యులు గ్రామస్తులు శస్త్ర చికిత్స నిమిత్తం ముందుగా కామారెడ్డి లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తిని సిద్ధ రామేశ్వరనగర్ గ్రామానికి చెందిన మహేందర్‌గా గుర్తించారు. బాధిత రైతు రాంరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా కలసి మహేందర్ వద్దకు చేరుకున్నారు. మొన్న దొంగతనానికి వచ్చింది నువ్వే కదా అంటూ ప్రశ్నించగా, నేనెందుకు వచ్చానంటూ విర్రవీగడమే కాకుండా, తడబడుతూ సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి రైతులు మహేందర్ షర్టు విప్పి చూడగా, వీపు భాగంపై బలంగా కొట్టిన వాతలు కమిలిపోయి ఉన్నాయి. కేబుల్ దొంగతనానికి వచ్చింది నువ్వే అంటూ రైతులు మహేందర్‌ను పీఎస్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై బాధితుడు రాంరెడ్డి గ్రామస్తులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story