ఒక్క ఆన్‌లైన్ పేమెంట్.. 17 ఏళ్ల పెళ్లి బంధాన్ని దెబ్బతీసింది

by karthikeya |   ( Updated:2024-10-08 15:39:05.0  )
ఒక్క ఆన్‌లైన్ పేమెంట్.. 17 ఏళ్ల పెళ్లి బంధాన్ని దెబ్బతీసింది
X

దిశ, సిటీక్రైం: ‘‘మీ నవ్వు బాగుంది.. మీరు అందంగా ఉంటారు.. మీరు ఇంత జాలీగా ఏలా ఉంటారు..?’’ ఈ మాటలు ఓ జంట 17 ఏళ్ల వైవాహిక జీవితంలో కలవరం రేపాయి. దీంతో 10 రోజులలో భార్యభర్తలు 8 సార్లు లండన్ టూ హైదరాబాద్, హైదరాబాద్ టూ లండన్ చక్కర్లు కొట్టారు. మరో వైపు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన 3 పోలీసు స్టేషన్‌ల పోలీసులు పరుగులు పెట్టారు. అయితే చివరికి ఈ సస్పెన్స్ థ్రిలర్ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించడంతో కథ సుఖాంతమైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ జంటకు 17 సంవత్సరాల కిందట వివాహమైంది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఏడాదిన్నర కిందట భర్త తన ఉద్యోగంలో భాగంగా ప్రమోషన్ రావడంతో లండన్‌కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో భార్య, పిల్లలని ఇక్కడే వదిలిపెట్టి ఒంటరిగా గతేడాది నవంబరులో లండన్‌కు వెళ్ళాడు. అంతా బాగానే ఉండగా.. గత నెల సెప్టెంబర్ 16 నుంచి అతడి భార్యను ఓ ట్యాక్సీ డ్రైవర్ ట్రాప్ చేయసాగాడు.

చిచ్చు పెట్టిన గూగుల్ పే పేమెంట్:

ఏడాది ప్రారంభంలో ఈ థ్రిలర్ మిస్సింగ్ కహాని స్టార్ట్ అయ్యింది. భర్త లండన్ వెళ్ళిపోయిన తర్వాత భార్య తన ఇద్దరు పిల్లలో కలిసి అత్తగారింట్లో ఉండసాగింది. ఫిబ్రవరి నెలలో ఆమె తల్లి చనిపోయింది. అస్తికలను కలిపేందుకు ఓ ట్రావెల్స్ కారు మాట్లాడుకుని వెళ్ళివచ్చారు. అయితే డ్రైవర్‌కు ట్రావెల్స్ అద్దెను చెల్లించేందుకు ఆమె తన గూగుల్-పే ద్వారా పేమెంట్ చేసింది. అలా ట్యాక్సీ డ్రైవర్ ఆ మహిళ నెంబరు సేవ్ చేసుకుని మొదటి రెండు, మూడు రోజులు హై, గుడ్ మార్నింగ్ లతో ఆమెని పలకరించాడు. ఆమె పెద్దగా స్పందించలేదు. కానీ ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి ‘‘మీ నవ్వు బాగుంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. మీకు చాలా టాలెంట్ ఉంది. అంటూ నెమ్మదిగా ఆమెని ట్రాప్ చేశాడు. ఆమె కూడా అతని మాయలో పడి ప్రతి రోజు ఫోన్‌లు మాట్లాడడం, అతనిని కలవడం చేసింది.

విషయం అత్తాగారింట్లో తెలియడంతో వారు లండన్‌లో ఉన్న కుమారుడికి అంతా చెప్పారు. దీంతో భర్త సెప్టెంబరు నెలలో భార్యను కాంటాక్ట్ అయి.. తన ఫ్యామిలీని కూడా లండన్‌కు తీసుకువచ్చేందుకు అనుమతి వచ్చిందని, పాసుపోర్టు, వీసాలు పంపిస్తున్నానని చెప్పి సెప్టెంబరు 16న భార్య పిల్లలను లండన్‌కు రప్పించాడు. అయితే సెప్టెంబరు 29న యువకుడి తల్లి మరణించింది. దీంతో అతను భార్య, పిల్లలను లండన్‌లోనే వదిలేసి తల్లి అంత్యక్రియలకు ఇండియా వచ్చేశాడు. భర్త వచ్చిన మరుసటి రోజే అంటే సెప్టెంబరు ౩౦న భార్య కూడా పిల్లలను ఓ పార్క్‌లో వదిలేసి ఇండియాకు వచ్చేసింది. ఓ గంటలో వచ్చేస్తానని చెప్పి మమ్మీ తమను పార్క్‌లో వదిలిపెట్టి వెళ్ళిందని పిల్లలు తండ్రికి ఫోన్ చేశారు.

ఈ మాటతో కంగుతిన్న భర్త.. భార్యకు కాల్ చేయడానికి ట్రై చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో హూటాహుటిన యువకుడు లండన్‌కు ఫ్లైట్ బుక్ చేసుకుని అక్టోబరు 1న చేరుకుని భార్య గురించి ఆరా తీశాడు. అయితే ఆమె లండన్ నుంచి ముంబాయికి వచ్చిందని తెలిసుకుని ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించాడు. చివరికి అక్టోబరు 3న శంషాబాద్ మధురనగర్ కాలనీలో ఆమె ఉన్నట్లు తెలుసుకుని.. ఫోన్ చేయగా.. కాల్ లిఫ్ట్ చేసిన ఆమె.. తనని ఎవరో కిడ్నాప్ చేశారని, ఇక్కడ శంషాబాద్‌లో పెట్టారని, ఇప్పుడే బాలాపూర్ వైపు తీసుకువెళ్తున్నారని చెప్పి కాల్ కట్ చేసింది. దీంతో భర్త వెంటనే పోలీసులను, స్నేహితులను అలర్ట్ చేశాడు.

అంతేకాకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు లండన్ నుంచి మెయిల్స్ పెట్టి తన భార్య మిస్సింగ్ ఫిర్యాదును చేశారు. దీంతో అలర్ట్ అయిన సైబరాబాద్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాజేంద్రనగర్, శంషాబాద్, బోయిన్ పల్లి తదితర పోలీసు విభాగాలు అప్రమత్తమై వివాహిత ఫోన్‌ను ట్రాక్ చేశారు. అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో చివరి లోకేషన్ రాజేంద్రనగర్‌లోనే చూపించసాగింది. పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో కేసు మిస్టరీగా మారింది.

గోవాలో ఆచూకీ:

అదే టైంలో హైదరాబాద్‌లో ఉంటున్న తన స్నేహితులు ద్వారా భార్య ఫోన్ నెంబరుతో పాటు ఆమెను ట్రాప్ చేసిన మాయగాడి ఫోన్ నెంబర్లుకు తరచూ ఫోన్‌లు చేయడంతో ఓ సందర్భంలో కాల్ లిఫ్ట్ చేసిన ఆమె, టాక్సీ డ్రైవర్ కాల్ లిప్ట్ చేసి తాము గోవాలో ఉన్నట్లు తెలిపారు. దీంతో భర్త స్నేహితులు ఆమెతో మాట్లాడగా.. ట్యాక్సీ డ్రైవర్ తనని ట్రాప్ చేశాడని, తనని కాపాడి తిరిగి భర్త దగ్గరకు చేర్చాలంటూ లైవ్ లొకేషన్‌తో పాటు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న టికెట్‌ను వాట్సాప్ చేసింది. దీంతో స్నేహితులు ఆ వివరాలను శంషాబాద్ పోలీసులకు పంపించారు. అలర్ట్ అయిన పోలీసులు టిక్కెట్ ఆధారంగా బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేసి ఆ మహిళతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని బస్సు దిగకుండా చూడాలని ఆర్డర్ ఇచ్చారు. అలా ఆదివారం బయలుదేరిన మహిళని, టాక్సీ డ్రైవర్‌ను సోమవారం ఉదయం 6 గంటల సమయంలో అమన్‌గల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని శంషాబాద్ పీఎస్‌కు తరలించారు. ఈ సమాచారాన్ని భర్తకు చెప్పడంతో అతను వెంటనే సోమవారం రాత్రి 9 గంటలకు లండన్‌కు టిక్కెట్ బుక్ చేశాడు.

ఉరి వేసుకుంటున్నట్లు బ్లాక్‌మెయిల్:

స్టేషన్‌కు వచ్చిన బాధితురాలు పోలీసులు విచారించినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఆమె లండన్ వెళ్లడంపై టాక్సీ డ్రైవర్ చాలా కోపంగా.. ‘‘నువ్వు నాకు చెప్పకుండా లండన్‌కు ఏలా వెళ్ళావు. అంత్యక్రియలకు వచ్చిన నీ భర్తను చంపేస్తా, నేను ఉరి వేసుకుంటున్న చూడు దీనికి నువ్వు, నీ భర్తే కారణం. పోలీసులకు చెప్పి మీ అందర్నీ జైలుకు పంపిస్తా. మీ పరువు తీస్తా’’ అంటూ బెదిరించాడని ఆమె చెప్పింది. తన భర్త ప్రాణాలు కాపాడాడడంతో పాటు పరువు పోకూడదనే అతను చెప్పినట్లు చేశానని, లండన్ నుంచి ఇండియాకి వచ్చానని చెప్పింది. మరో వైపు టాక్సీ డ్రైవర్ మాత్రం.. ‘‘నా తప్పు ఏమీ లేదు. ఆమే నాతో ఉంటానంది. ఇద్దరం కలిసి ఉందామనుకున్నాం. కలిసే గోవా వెళ్ళాం’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

చివరకు భర్త లండన్ నుంచి పోలీసులతో మాట్లాడి తన పిల్లల కోసం తన భార్యను లండన్ పంపించాలని కోరడంతో సోమవారం రాత్రి శంషాబాద్ పోలీసులు చట్టపరంగా అన్ని చర్యలను తీసుకుని 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమెని లండన్‌‌కు పంపించారు. అనంతరం టాక్సి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా ఇలా ఎంతమంది యువతులు, మహిళలను ట్రాప్ చేశాడనే కోణంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed