బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

by Sridhar Babu |
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
X

దిశ, వలిగొండ : గుట్టు చప్పుడు కాకుండా మైనర్ బాలికకు వివాహం చేయాలనే ప్రయత్నాన్ని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అడ్డుకొని బాలికను భువనగిరి సఖీ కేంద్రానికి తరలించిన ఘటన మండలంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వేములకొండ వద్ద బుధవారం చోటు చేసుకుంది. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లాకు చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలికకు జనగామ జిల్లాకు చెందిన ఒక వ్యక్తితో వివాహం చేయడానికి నిశ్చయించుకొని వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్ట కింద వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.

బాల్య వివాహం సమాచారాన్ని చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి వివాహం జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకొని బాలికను భువనగిరి సఖీ కేంద్రానికి తరలించారు. చైల్డ్ వేల్ఫేర్ అధికారుల ఫిర్యాదు మేరకు బాల్య వివాహం జరిపించడానికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

Advertisement

Next Story