నషా సే ఆజాదీ.. డ్రగ్స్ పై పోలీసుల వినూత్న ప్రయోగం

by Javid Pasha |
నషా సే ఆజాదీ.. డ్రగ్స్ పై పోలీసుల వినూత్న ప్రయోగం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మాదక ద్రవ్యాల మహమ్మారిని రూపుమాపటానికి హైదరాబాద్​దక్షిణ మండలం పోలీసులు ‘నషా సే ఆజాదీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెడికల్​షాపులు, స్టేషనరీ దుకాణదారుల సహకారంతో డ్రగ్స్ కు అలవాటు పడ్డవారికి వాటి వల్ల ఏర్పడే దుష్పరిణామాల గురించి తెలిసేలా ప్రచారం చేయనున్నారు. సంజరీ ఫంక్షన్​హాల్లో సోమవారం మెడికల్, స్టేషనరీ షాపుల యజమానులు, సిబ్బందితో సమావేశమైన దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య డ్రగ్స్​పై ఎలా అవగాహన కల్పించాలో వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు తమ ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేసుకుంటుండటంతోపాటు కుటుంబాలను కూడా కష్టాల్లోకి నెడుతున్నారు. కొందరు మత్తులో నేరాలకు సైతం పాల్పడుతూ జైళ్ల పాలవుతున్నారు. ఏయేటికాయేడు డ్రగ్స్ మహమ్మారికి అలవాటుపడుతున్న వారి సంఖ్య ఆందోళనాకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో నషా సే ఆజాదీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు డీసీపీ సాయి చైతన్య తెలిపారు.

దీనికోసం మెడికల్, స్టేషనరీ షాపుల యజమానులు, వాటిల్లో పని చేస్తున్న వారి సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. వీళ్ల ద్వారా డ్రగ్స్ వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ కరపత్రాల పంపిణీని జరిపించనున్నట్టు చెప్పారు. ఇలా చేయటం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించటానికి వీలు పడుతుందని వివరించారు. దీనికి సహకారం అందిస్తున్న సంజరీ ఫంక్షన్​హాల్​యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. నషా సే ఆజాదీ కార్యక్రమంలో భాగంగా దక్షిణ మండలం పరిధిలోని వేర్వేరు స్కూళ్లు, కాలేజీలు, ఇతర కమ్యూనిటీ ఆర్గనైజేషన్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలపై విద్యార్థులతోపాటు యువకుల్లో అవగాహన కల్పిస్తామన్నారు.

Advertisement

Next Story