102 కేసులున్న ఘరానా దొంగ అరెస్టు

by Sridhar Babu |
102 కేసులున్న ఘరానా దొంగ అరెస్టు
X

దిశ, కామారెడ్డి : హైదారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, కామారెడ్డి ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడిన ఓ ఘరానా దొంగను అరెస్టు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తెలిపారు. మంగళవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. హైద్రాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో 102 చోరీలకు పాల్పడిన దొంగను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 17న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గోష్క రాజయ్య కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఇంజమూరి రాములు తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నర్సన్నపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతన్ని పట్టుకుని విచారించగా నిందితుడు హైదరాబాద్ లోని టోలిచౌక్ కు చెందిన మీర్ ఖజామ్ ఆలీ ఖాన్ అలియాస్ కాజు అలియాస్ సూర్యా భాయ్ గా తెలిపాడన్నారు. కామారెడ్డి పీఎస్ పరిధిలోని బైక్ దొంగతనం, దేవునిపల్లి పీఎస్ పరిధిలోని గోష్క రాజయ్యకాలనీలో ఇంట్లో బంగారం, నగదు దొంగతనం చేసిన నేరాలను ఒప్పుకున్నాడని, వాటిని దాచిపెట్టిన చోటికి తీసుకెళ్లగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడున్నర తులాల బంగారం గొలుసు, 1.2 తులాల మరో గొలుసు, ఆకుపచ్చ రాయి ఉన్న బంగారం 6 గ్రాములు, 3 ఉంగరాలు 1.2 గ్రాములు, బైక్ స్వాధీనం చేసుకోగా వాటి విలువ 1,43,000గా ఉంటుందన్నారు.

నిందితుడు మీర్ కజామ్ ఆలీ ఖాన్ పై హైదరాబాద్ కమిషనరేట్ లో, సంగారెడ్డి జిల్లా పరిధిలో అన్ని కలిపి 102 కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నేరస్తున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన దేవునిపల్లి ఎస్సై రాజు, ఎస్సై 2 మధుసుదన్ రెడ్డి, క్రైం కానిస్టేబుల్ రామస్వామి, బాలకృష్ణ, హోంగార్డు రాజు, టెక్నికల్ సిబ్బంది రోహిత్, శ్రీనులను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed