సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల వల.. ఇరాన్‌కు డ్రగ్స్ పంపిస్తున్నావంటూ ఫేక్ కాల్

by Jakkula Mamatha |
సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల వల.. ఇరాన్‌కు డ్రగ్స్ పంపిస్తున్నావంటూ ఫేక్ కాల్
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా సేఫ్‌గా బయటపడ్డాడు. సీసీఎస్ సైబర్ క్రైమ్ ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ నిర్వహిస్తున్న కానిస్టెబుల్ శ్రీకాంత్ నాయక్ చాకచక్యంగా పనిచేయడంతో 11 నిమిషాల్లో 18 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా వాటిని బ్యాంకు ఖాతాల్లోనే స్తంభింప చేయగలిగారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ నెల 27 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఆధార్ కార్డు నెంబర్ చెప్పి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గందరగోళంలో పడేశాడు. మీ ఆధార్ నెంబరుతో ఓ డ్రగ్స్ పార్శిల్ ముంబాయి నుంచి ఇరాన్‌కు వెళ్తుంది. దానిని ఫెడ్ ఎక్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. వాటిని ముంబాయి పోలీసులు సీజ్ చేశారు.

ఇప్పుడు మీ పేరు మీద కేసు నమోదైంది. ముంబయి పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపెట్టించారు. వెంటనే మీరు స్కైప్ కాల్ లోకి వస్తే మిమ్మల్ని విచారించాల్సి ఉందని ఉక్కిరిబిక్కిరి చేశారు. అలా స్కైప్ కాల్ లో మాట్లాడుతుండగానే మీరు నిజాయితీ పరులని నిరూపించుకోవాలంటే మీరు మీ బ్యాంక్ ఖాతా నుంచి మా అకౌంట్లోకి డబ్బులు పంపితే వాటిని పరిశీలించి తిరిగి మీకు పంపిస్తామని నమ్మించారు. ఖాతాలో డబ్బులు లేవంటే మీరు బ్యాంక్ లోన్ తీయండి దాని కోసం మేము ప్రక్రియ చెప్పుతామని చెప్పి కాల్ లో ఉండగానే లోన్‌ను తీయించి మొత్తం 18 లక్షల రూపాయలను వారి ఖాతాలకు మళ్లించారు. చివరకు ఇది మోసమని గ్రహించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంటనే 27న సాయంత్రం 6.58 నిమిషాలకు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.

ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ నుంచి చూస్తున్న కానిస్టెబుల్ శ్రీకాంత్ నాయక్ వెంటనే స్పందించి ముందుగా బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసి 7.09 నిమిషాల కు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్ళకుండా ఆపేశాడు. ఇలా మొత్తం 11 నిమిషాల్లో 18 లక్షలు ఖాతాలోనే ఉండిపోవడంతో పోలీసులు, బాధితుడు ఊపిరి పీల్చుకున్నారు. వాటిని తిరిగి బాధితుడికి పోలీసులు ప్రక్రీయ ద్వారా అందజేయనున్నారు. ఎవరైనా సరే మీకు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే అసలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ లో విచారణ, దర్యాప్తు, వివరాలను అడగరని ప్రతి ఒకరు గుర్తించుకోవాలి. అదే విధంగా పోలీసులు ఎప్పుడు నగదును ఖాతాల్లో జమ చేయమని వాట్సాప్, స్కైప్ కాల్స్ లో అడగరని గుర్తించుకోవాలి. ఇలా అడిగితే అది సైబర్ మోసగాళ్ల పనేనని నిర్ధారించుకోవాలి. ఆ ఫోన్ ను కట్ చేయాలి. వచ్చిన ఫోన్ నెంబరు వివరాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed