మధ్యప్రదేశ్‌లో దారుణం.. దళిత యువకుడిని కొట్టి చంపి.. తల్లిని వివస్త్రగా చేసిన దుండగులు

by Vinod kumar |
మధ్యప్రదేశ్‌లో దారుణం.. దళిత యువకుడిని కొట్టి చంపి.. తల్లిని వివస్త్రగా చేసిన దుండగులు
X

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ఓ వైపు మహిళా ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తుంటే.. మరోవైపు అక్కడ స్త్రీలపై అఘాయిత్యాలు పెరుగుతూ పోతున్నాయి. సాగర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో అమానుషం జరిగింది. 2019 సంవత్సరంలో తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన దళిత యువతి కుటుంబంపై విక్రమ్ సింగ్ అనే అగ్రవర్ణ వ్యక్తి మరో 8 మందితో కలిసి దాడికి తెగబడ్డాడు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. అయినా వినకపోవడంతో బాధిత యువతి సోదరుడు 18 ఏళ్ల నితిన్ అహిర్వార్‌ను దారుణంగా కొట్టి చంపారు. ఈక్రమంలో అడ్డుకోబోయిన యువకుడి తల్లిని వివస్త్రగా చేసి కొట్టారు. అక్కడే ఉన్న యువకుడి సోదరిని రేప్ చేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె సమీపంలోని అడవిలోకి పరుగు పెట్టింది. ఆ 9 మంది వ్యక్తులు దళిత కుటుంబం నివసిస్తున్న ఇంటిని అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు.

యువకుడి సోదరి ఫోన్ చేయడంతో అక్కడికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు.. 13 మందిపై హత్యా నేరం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఆ గ్రామ సర్పంచ్ భర్త, మరో నిందతుడు కోమల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీపై, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై మండిపడ్డాయి. బీఎస్పీ చీఫ్ మాయావతి బీజేపీపై విరుచుకుపడ్డారు.

‘ఇటీవలే సాగర్ జిల్లాలో సంత్ గురు రవిదాస్ జీ స్మారకానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అదే ప్రాంతంలో ఉన్న సంత్ గురు రవిదాస్ జీ భక్తులపై జరుగుతున్న అఘాయిత్యాలకు హద్దు లేకుండా పోయింది. ఇది బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం’ అని ఆరోపించారు. దళితులపై వివక్షకు మధ్యప్రదేశ్‌ను ఒక లేబొరేటరీగా బీజేపీ మార్చుకుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story