ఫౌండేషన్​పేర భిక్షాటన.. శారీరక వికలాంగులతో కలెక్షన్లు

by Vinod kumar |
ఫౌండేషన్​పేర భిక్షాటన.. శారీరక వికలాంగులతో కలెక్షన్లు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫౌండేషన్​పేరుతో శారీరక వికలాంగులతో భిక్షాటన చేయిస్తున్న వ్యక్తిని సెంట్రల్​జోన్​టాస్క్​ఫోర్స్​అధికారులు బేగంబజార్​పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. నిందితుని నుంచి క్యూఆర్​కోడ్​స్టిక్కర్లు అంటించిన స్టీల్​బాక్సులు, వెయ్యి రూపాయల నగదు, సెల్​ఫోన్, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్​జోన్​డీసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్​ఫోర్స్​డీసీపీ రాధాకిషన్​రావు కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ఎక్లాషన్​పేట్​తాండాకు చెందిన బానావత్​రామకృష్ణ (39) వృత్తిరీత్యా కారుడ్రైవర్. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన రామకృష్ణ బోడుప్పల్​వీరారెడ్డి నగర్‌లో స్థిరపడ్డాడు.

ఇక్కడకు వచ్చిన తరువాత శారీరక వికలాంగుల కోసం పని చేస్తున్న బోడుప్పల్‌లోని గుడ్​వే ఫౌండేషన్​ఛైర్మన్​షణ్ముఖరావు వద్ద కారుడ్రైవర్​గా ఉద్యోగంలో చేరాడు. 2017లో అక్కడ ఉద్యోగం మానేసి బోడుప్పల్‌కే చెందిన రవి అనే వ్యక్తితో కలిసి శారీరక వికలాంగుల సంక్షేమం కోసమంటూ శ్రీకృష్ణ ఫౌండేషన్​పేరుతో సంస్థను ప్రారంభించాడు. ఫౌండేషన్‌కు చెందిన హోంలో కొంతమంది శారీరక వికలాంగులను చేర్చుకున్నాడు. కాగా, ఆరునెలలపాటు రామకృష్ణతో పని చేసిన రవి ఆ తరువాత సొంతంగా అమ్మ చేయూత పేరుతో మరో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరుతో మహిళలు, యువతులతో భిక్షాటన చేయిస్తూ ఇటీవలే పోలీసులకు పట్టుబడ్డాడు.

విచారణలో రవి వెల్లడించిన వివరాల మేరకు టాస్క్​ఫోర్స్​ఇన్స్​పెక్టర్​రాజూ నాయక్​బేగంబజార్​పోలీసులతో కలిసి బేగంబజార్​ప్రాంతంలో శుక్రవారం రామకృష్ణను అరెస్టు చేశారు. విచారణలో రామకృష్ణ బేగంబజార్​మార్కెట్​నుంచి కొన్ని స్టీల్​బాక్సులను కొని వాటిపై తన బ్యాంక్​ఖాతాకు సంబంధించిన క్యూఆర్​కోడ్​స్టిక్కర్‌ను అతికించి హోంలో ఉన్న శారీరక వికలాంగులకు వాటిని ఇచ్చేవాడని వెల్లడైంది. డబ్బాలకు తాళాలు వేసి ఇచ్చి బేగంబజార్​తోపాటు వేర్వేరు ప్రాంతాల్లో వారితో భిక్షాటన చేయించేవాడని తేలింది. ఇలా ప్రతీరోజూ వెయ్యి నుంచి రెండువేల రూపాయలు సంపాదిస్తూ జల్సా జీవితం గడుపుతున్నాడని వెల్లడైంది. భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తంలో కేవలం ఇరవై శాతం భిక్షాటన చేసిన శారీరక వికలాంగులకు ఇచ్చేవాడని నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు తమ సంస్థకు విరాళాలు ఇస్తే ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పి పలువురి నుంచి పెద్ద మొత్తాలు వసూలు చేసినట్టుగా వెల్లడైంది. నిందితున్ని అరెస్టు చేయటంలో బేగంబజార్​ఇన్స్​పెక్టర్​శంకర్, డీఐ ఏడుకొండలు, ఎస్సైలు సాయితేజ రెడ్డి, ప్రతాప్​రెడ్డి, నర్సింహ తదితరులు ప్రధానపాత్ర వహించారు.

Advertisement

Next Story