వ్యవసాయ మోటార్లే వారి టార్గెట్

by Sridhar Babu |
వ్యవసాయ మోటార్లే వారి టార్గెట్
X

దిశ,డోర్నకల్ : గుట్టు చప్పుడు కాకుండా రాత్రుళ్లు వ్యవసాయ బావుల వద్ద ఎలక్ట్రిక్ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల ముఠాను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీసులు పట్టుకున్నారు. 19 మోటర్లు, 2 స్కూటీలు, ఓ ట్రాలీ, రూ.70 వేల నగదును స్వాధీన పర్చుకోగా మొత్తం సొత్తు విలువ రూ.4.54 లక్షలుగా పోలీసులు తెలిపారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను డోర్నకల్ పీఎస్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముత్యాలు, గణేష్, సదర్ లాల్, నాగరాజు, జోహర్ లాల్, సిద్ధూ, శ్రీను, శివ, మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం డోర్నకల్ సీఐ బి.రాజేష్, ఎస్ఐ వంశీధర్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ట్రాలీ వాహనం పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో వాహనంలో రెండు మోటార్లు, రెండు స్కూటీలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అందులో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గత నాలుగు నెలల నుండి వివిధ ప్రాంతాలలో కరెంట్ మోటార్లు, ఇనుప వస్తువులు దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో పది మంది ఓ గ్యాంగ్ గా ఏర్పాటై 4 నెలల నుండి మహబూబాబాద్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో మొత్తం 19 మోటార్లు, టన్నున్నర ఐరన్ దొంగతనం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ప్రధాన నిందితురాలు ముత్యాలు మోటారు దొంగతనం చేయాలని తన స్నేహితురాలైన నాగలక్ష్మి ట్రాలీను కిరాయికి తీసుకొని దొంగతనాలకు వాడినట్లు నిర్దారించారు. వారి నుంచి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మొత్తం ఏడు మోటార్లు, టన్నున్నర ఇనుప రాడ్లు, కురవి మండలంలో రెండు మోటార్లు, నర్సింహులపేట మండలంలో ఒక మోటార్, ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో ఐదు మోటార్లు, చింతకాని మండలంలో రెండు మోటార్లు, తల్లాడ మండలంలో ఒక మోటారు, ఖమ్మం రూరల్ పరిధిలో ఒక మోటారు దొంగలించినట్టు చెప్పారు. నిందితుల్లో ఆరుగురు పట్టుబడగా శ్రీను, శివ మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ రాజేష్, ఏఎస్ఐ కోటేశ్వరరావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆయన వెంట డీఎస్పీ తిరుపతి రావు, సీఐ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed