- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొలువుతీరిన రామ్‌లల్లా.. పులకించిన అయోధ్య
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామయ్య మళ్లీ తన పవిత్ర జన్మస్థలంలో కొలువుతీరాడు. దీంతో రామభక్తుల 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా రామమందిరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉన్న 84 సెకన్ల దివ్య ముహూర్తంలోగా రాముడి ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ జరిగింది. ఈ సమయంలోనే ప్రధాని మోడీ బాలరాముడి విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగించారు. దీంతో ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దిన ప్రధాని.. రామ్‌లల్లాకు చిన్న అద్దాన్ని చూపించారు. ఆ వెంటనే శ్రీరాముడికి పట్టు వస్త్రాలు, వెండి గొడుగును మోడీ బహూకరించారు. 108 దీపాలతో రామచంద్ర స్వామికి మొదటి ‘మహా హారతి’ ఇచ్చారు. దీంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసింది. గర్భగుడిలో జరిగిన శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో అయోధ్య రామమందిరంపై భారత వాయుసేన హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించారు.
అయోధ్యలో పండుగ వాతావరణం
అంతకుముందు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ రామజన్మభూమికి చేరుకున్నారు. ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్ తిలాలో ఉన్న శివ మందిర్‌ను సందర్శించారు. మోడీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నాగ సాధువులు సందడి చేశారు. భారీ ర్యాలీగా అయోధ్యకు నాగసాధువులు తరలివచ్చారు. స్థానికులు వాళ్లకు ఘనస్వాగతం పలికారు. నాగసాధువుల కర్రసాము, కత్తిసాము అందరినీ ఆకట్టుకుంది. అయోధ్యా నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు దాదాపు 7వేల మంది పాల్గొన్నారు.
వివిధ రంగాల ప్రముఖులు..
అయోధ్యలో జరిగిన రామోత్సవంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ జాబితాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, రజనీకాంత్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అమితాబ్‌బచ్చన్, విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, కత్రినా కైఫ్, అనుపమ్ ఖేర్, రాజ్‌కుమార్ హిరానీ, రిషభ్ శెట్టి, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, ముకేశ్ అంబానీ దంపతులు, కుమార మంగళం బిర్లా, అనన్య బిర్లా, అనిల్ అంబానీ, ఆకాశ్, శ్లోకా, ఈశా అంబానీ, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురువు రాందేవ్ బాబా తదితరులు పాల్గొన్నారు.