- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9 నెలల్లో 26 మంది మృతి… ఎక్కడ? ఎలా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్ చుట్టూర ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్పుకున్నప్పటికీ అవి కార్యరూపంలోకి రావడం లేదు. ఓఆర్ఆర్‌లో గత 9 మాసాల్లో 81 ప్రమాదాలు, 26 మంది మృత్యువాత పడ్డారు. ఇక్కడ ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు సమయానికి అందడం లేదని బాధితులు వెల్లడిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులు మృత్యువుతో పోరాడుతున్నారు. సేవలకోసం, సహాయానికి అర్జిస్తూనే తుది శ్వాస వదులుతున్న సందర్భాలు లేకపోలేదని బాధితులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు ఉండే గోల్డెన్ హవర్‌లో వైద్య సేవలు అత్యంత విలువైనవి, అవి లభించకపోవడంతో మరణాలు అధికంగా నమోదవుతున్నట్లు అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. నాలుగేండ్ల కిందట ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదపు బాధితులకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ఓఆర్ఆర్ కూడళ్లలోని టోల్ మేనేజ్‌మెంట్ భవనాల్లో ఒక అంతస్తు లేదా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ట్రామాకేర్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ, ఆచరణలో అవి కనిపించడం లేదు. కనీసం అందుబాటులో ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి లేదు. ఓఆర్ఆర్ మొత్తం పొడవు 158 కి.మీ.లు 19 ఇంటర్ చేంజెస్‌లు. వీటిల్లో వేసైడ్ ఎమినిటీస్ అంటూ ప్రకటిస్తున్నారు. కానీ, ఫెసిలిటీస్ ఏమీ లేవు.
10 ట్రామా కేర్ సెంటర్లు..
ఓఆర్ఆర్ 19 కూడళ్లలో కనీసంగా 10 ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఒక డ్యూటీ డాక్టర్‌తోపాటు ఇతర సిబ్బంది, అత్యవసరమయ్యే అన్ని రకాల ఎక్విప్‌మెంట్, ల్యాబ్, ఎక్స్ రే వంటి వైద్య సేవలందించేందుకు 24/7 అందుబాటులో ఉండేట్లుగా సెంటర్లుండాలని అధికార యంత్రాంగం వెల్లడించింది. బాధితులకు ఇక్కడ అత్యవసర వైద్యసేవలు అందించిన అనంతరం ఇతర ఆస్పత్రులకు తరలిస్తామని అధికారులు వివరించారు. అత్యవసరమైతే హెలికాప్టర్‌లను కూడా అందుబాటులో ఉండాలనే ప్రతిపాదన కూడా అప్పట్లో తెరపైకి వచ్చింది. కానీ, ఏండ్లు గడుస్తున్నా ప్రయోగాత్మకంగా ఒక్క ట్రామా కేర్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. టోల్‌మేనేజ్‌మెంట్ భవనాలు అందుబాటులో ఉన్నాయని, లేదా సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తామని తెలిపిన అధికార యంత్రాంగం ఇప్పటి వరకు వాటిని ఏర్పాటు చేయడమే మరిచిందన్న విమర్శలున్నాయి.
నెలకు 9 ప్రమాదాలు..
ఓఆర్ఆర్‌లో గత 9 నెలల్లో 81 రోడ్డు యాక్సిడెంట్స్ జరిగాయి. నెలకు 9 ప్రమాదాలు కేవలం ఓఆర్ఆర్‌లోనే జరుగుతున్నాయి. సుమారుగా నెలకు 3 వాహనదారులు ప్రాణాలను కోల్పోతున్నారని రికార్డులు వెల్లడిస్తున్నాయి. 81 రోడ్డు యాక్సిడెంట్స్‌లో 185 మంది ప్రమాదానికి గురయ్యారు. 26 మంది మృత్యువాత పడగా విషమ పరిస్థితికి చేరుకున్నవారు 16, ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు 65, గాయాలకు గురైనవారు 78 మంది ఉన్నారు. చనిపోయినవారిలో చాలా వరకు అత్యవసర సేవలు అందకనే చనిపోయారని గాయాలకు గురైనవారి అభిప్రాయం. గోల్డెన్ హవర్‌లో వైద్య సేవలు అందిస్తే ఇందులో చాలా మంది బతికే అవకాశాలున్నాయని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినవారు వెల్లడిస్తున్నారు.