తెలంగాణలో కొత్తగా 62 కరోనా కేసులు

by vinod kumar |
తెలంగాణలో కొత్తగా 62 కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కరోనా మరింతగా భయపెడుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గురువారం ఐదుగురు మరణించగా శుక్రవారం మరో ముగ్గురు చనిపోయారు. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 62 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రమంతా గ్రీన్‌జోన్‌గా ప్రభుత్వం ప్రకటించినప్పుడే ప్రజల్లో సందేహాలు పొడసోపాయి. ఇప్పుడు రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ సిటీ రెడ్ జోన్‌గా ఉన్నప్పటికీ ఆంక్షలు కంటైన్‌మెంట్ జోన్లకే పరిమితమై మిగిలిన ప్రాంతాలన్నీ మామూలుగా మారిపోయాయి. ఫలితంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు గణనీయంగా పెరుగతున్నాయి. గడచిన రెండు వారాల వ్యవధిలోనే 600కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా శుక్రవారం ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 48కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 42, రంగారెడ్డిలో ఒకటి, వలస కార్మికుల్లో 19 చొప్పున ఉన్నాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,761కు చేరుకుంది. కరోనా చికిత్స అనంతరం 1,043 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 670 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వలస కార్మికుల్లో కరోనా సోకిన వారి సంఖ్య 118కి చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కరోనా పాజిటివ్ బయట పడుతోందని హెల్త్ బులిటెన్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed