60 డివిజన్లతో ఖమ్మం కార్పొరేషన్ ఫైట్!

by Anukaran |
60 డివిజన్లతో ఖమ్మం కార్పొరేషన్ ఫైట్!
X

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం : ఖ‌మ్మం కార్పొరేషన్​ గ‌మ‌నంలో మ‌రో ముంద‌డుగు. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లు 60కి పెర‌గ‌నున్నాయి. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేషన్ల డివిజ‌న్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా ల‌భించింది. ఇదే విష‌యాన్ని బుధ‌వారం మంత్రి అజ‌య్‌కుమార్ కూడా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలోనే ఈ రెండు కార్పొరేషన్లలో డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. మార్చి 6వ తేదీతో పాల‌క‌వ‌ర్గం గ‌డువు ముగియనుండడంతో, దాదాపు జ‌న‌వ‌రి నెల‌లో డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న ప్రక్రియ మొదలవుతుందని కార్పొరేషన్​ ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తోంది.

మార‌నున్న డివిజ‌న్ల స్వరూపం..

పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో డివిజ‌న్ల స్వరూపం మారనుంది. మొత్తం ఓటర్లలో సగటున డివిజ‌న్‌కు కేటాయింపు చేస్తూ పున‌ర్విభ‌జ‌న ప్రక్రియ కొన‌సాగనుంది. ఒక్కో డివిజ‌న్‌కు 10 శాతం ఓట‌ర్లు త‌క్కువ‌ లేదా ఎక్కువ గానీ ఉండ‌నున్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో డివిజ‌న్‌లో 12 వేల‌కు అటుఇటుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్త డివిజ‌న్ల ఏర్పాటు నేప‌థ్యంలో ఇంచుమించు 10 వేలు ఉండే అవకాశాలున్నాయి.

డివిజన్ల రిజర్వేషన్లు సైతం..

డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న అనివార్యమవుతున్న వేళ స‌హ‌జంగానే డివిజ‌న్ల రిజ‌ర్వేష‌న్లలో కూడా మార్పులు జ‌రుగుతాయ‌ని అధికారులు వెల్లడిస్తున్నారు. డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న‌కు ప్రతిపాదనలు, అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌, ఓట‌రు న‌మోదు, ఓట‌రు జాబితా, ముసాయిదా, తుది జాబితా విడుద‌ల ఇలా ఎన్నిక‌ల తంతులో చాలా ప్రక్రియ ఇమిడి ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇవ‌న్నీ పూర్తి కావాలంటే సుమారు నెలన్నర సమయం ప‌డుతుంద‌ని అధికారులు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ఎన్నిక‌ల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధత తెలుపగానే ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేషన్​ విడుద‌ల‌కు స‌మాయ‌త్తమ‌వుతుంద‌ని పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed