ముంబయిలో 53 మంది మీడియా సిబ్బందికి పాజిటివ్

by vinod kumar |
ముంబయిలో 53 మంది మీడియా సిబ్బందికి పాజిటివ్
X

ముంబయి: కరోనా ఆపత్కాలంలో లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. కానీ, వారికీ ముఖ్యంగా మీడియా సిబ్బందికి వైరస్ సోకితే.. అత్యవసర సేవలకు ఆటంకం కలగడమే కాదు, వైరస్ కూడా వేగంగా విస్తరించే ప్రమాదమున్నది. అందులోనూ ఆ వైరస్ లక్షణాలు బాధితుల్లో వెల్లడికాకుంటే మరింత ముప్పు ఏర్పడుతుంది. ఇదే ఆందోళన ముంబయి మహానగరంలో వ్యక్తమవుతున్నది. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు ఈ నెల 16, 17వ తేదీల్లో ఆజాద్ మైదాన్‌లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో 171 మంది మీడియా సిబ్బంది(ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరా మెన్‌లు) నుంచి కరోనా పరీక్ష కోసం శాంపిళ్లు తీసుకున్నారు. ఇందులో 53 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలిందని బీఎంసీ అధికార ప్రతినిధి విజయ్ ఖాబలే తెలిపారు. అందులోనూ చాలా మందికి ఇప్పటికీ వైరస్ లక్షణాలు బయటపడటం లేదని పేర్కొన్నారు. వారందరినీ ఐసొలేషన్‌కు తరలించినట్టు వివరించారు. కాగా, ఈ సిబ్బందితో కాంటాక్టులోకి వెళ్లినవారిని కనుగొనే చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు.

Tags: media persons, positive, mumbai, coronavirus, asymptomatic, BMC

Advertisement

Next Story