లెక్కలు ఎలా..? కేంద్ర నిర్ణయంతో ప్రభుత్వానికి చిక్కులు

by Shyam |   ( Updated:2021-09-22 22:54:38.0  )
లెక్కలు ఎలా..? కేంద్ర నిర్ణయంతో ప్రభుత్వానికి చిక్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మృతుల కుటుంబాలకు తలా రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలియజేసింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నుంచి చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ఆస్పత్రులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ఆధారంగా పరిహారానికి మృతుల కుటుంబాలకు అర్హత ఉంటుందో లేదో క్లారిటీ వస్తుందని పేర్కొని ఇందుకోసం ప్రతీ జిల్లాలో గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రానికి కొత్త చిక్కులు వచ్చి పడే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారికంగా బులెటిన్‌లో వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణలో సెప్టెంబరు 21 నాటికి 3,908 మంది కరోనా కారణంగా చనిపోయారు. కానీ వాస్తవిక లెక్క ఇంతకంటే ఎక్కువే ఉంటుందనే అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి. కరోనా కారణంగానే చనిపోయారంటూ డెత్ సర్టిఫికెట్‌లో పేర్కొన్నా.. బులెటిన్‌లలో మాత్రం ఆ అంకెలు ప్రతిబింబించలేదనే విమర్శలూ వినిపించాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించడంతో బులిటెన్లలో లెక్కలు ఎలా ఉన్నా.. డెత్ సర్టిఫికెట్ ఆధారంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయోనన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో భారీ సంఖ్యలోనే దరఖాస్తులు రావచ్చన్న చర్చలు మొదలయ్యాయి.

కరోనా మృతుల విషయంలో తొలి వేవ్‌లోనే చాలా గందరగోళం నెలకొన్నది. కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం శ్మశానాల్లో కాలుతున్న శవాల లెక్కలకు, ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలకు మధ్య పొంతన లేదు. దాదాపు ఐదారు రెట్లు తేడా ఉంది. సెకండ్ వేవ్‌లో ప్రతీ రోజు వందల సంఖ్యలో చనిపోయారు. అయినా ప్రభుత్వం మాత్రం లెక్కల్లో పెద్దగా చూపించలేదు. అయితే ఇందులో ఎంత మంది డెత్ సర్టిఫికేట్లలో కరోనా అని పేర్కొన్నదీ స్పష్టత లేకుండా పోయింది. ఇప్పుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత తేడాలు కనిపించే అవకాశం ఉన్నది.

డెత్ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా స్థాయిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మృతుల కుటుంబాలు రూ. 50 వేల పరిహారానికి అర్హమైనవో లేవో ఖరారు చేయనున్నది. కొన్నిచోట్ల డెత్ సర్టిఫికేట్లలో కరోనా అని పేర్కొన్నప్పటికీ లెక్కల్లోకి చేరలేదు. ఇప్పుడు పరిహారం కోసం ఇలాంటి కుటుంబాలన్నీ దరఖాస్తు చేసుకుంటే లెక్కల్లో తేడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంతకాలం అధికారులు వెల్లడించిన బులెటిన్ల గణాంకాల విశ్వసనీయతకు మాయని మచ్చను తీసుకొచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో కరోనా మృతుల సంఖ్యను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేసి చూపించిందనే అపవాదు ఉన్నది. ఇప్పుడు ఏమాత్రం మృతుల సంఖ్య పెరిగినట్లు తేలినా అది మరింత డ్యామేజీకి దారితీస్తుంది.

ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,908 మంది మృతులకు తలా రూ. 50 వేల చొప్పున సుమారు రూ. 19.54 కోట్ల మేరకు ఎస్‌డీఆర్ఎఫ్ నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కొద్దిమంది హెల్త్ కేర్ సిబ్బంది ప్రధాని బీమా నుంచి రూ. 50 లక్షల చొప్పున తీసుకున్నందున గరిష్ఠంగా యాభై మంది వరకు తగ్గే అవకాశం ఉంటుంది. జిల్లాల్లో నమోదయ్యే దరఖాస్తుల సంఖ్యను బట్టి కరోనా కారణంగా ఎంత మంది చనిపోయారనేది ఒక మేరకు తేలే అవకాశం ఉంది. చాలా ఆస్పత్రుల్లో డాక్టర్లు డెత్ సర్టిఫికెట్లలో కరోనాను కారణంగా చూపించకుండా గుండెపోటు, దీర్ఘకాల వ్యాధులుగా నమోదు చేశారు. అలాంటి కుటుంబాలన్నీ ఇప్పుడు పరిహారం అందుకోడానికి అర్హత కోల్పోయినట్లే.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం చనిపోయినవారి కేస్ హిస్టరీ షీట్ ఆధారంగా డెత్ సర్టిఫికెట్లలో మార్పుల కోసం మళ్ళీ డాక్టర్లను సంప్రదించే అవకాశమూ లేకపోలేదు. ఇది ఆస్పత్రి వర్గాలతో బాధితుల కుటుంబాలకు సరికొత్త ఘర్షణలకు, వాదనలకు దారితీసే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం చివరకు రాష్ట్రానికి సరికొత్త చిక్కులను తీసుకొచ్చినట్లయింది.

Advertisement

Next Story