ఈజిప్టులో తేళ్ల దాడి.. 450 మందిని కాటేసిన స్కార్పియన్స్

by Shyam |
scorpion
X

దిశ, ఫీచర్స్: ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాల మాదిరిగానే ఈజిప్టులోనూ తీవ్ర కరువు పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ వారాంతంలో సంభవించిన రికార్డు స్థాయి తుఫాన్ల కారణంగా అనేక జీవులు గూళ్ళ నుంచి బయటికొచ్చాయి. ఈ క్రమంలోనే అస్వాన్ నగరంలో ‘తేళ్లు’ వరదలా బయటికొచ్చి నగరాన్ని చుట్టుముట్టాయి. విషపూరిత తేళ్లు కుట్టడంతో వందలాది మంది గాయాలపాలవగా, వర్షం కారణంగా విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మరణించారు.

నైలు నదికి సమీపంలో భారీ వర్షాలు, వడగళ్లతో పాటు ధూళి తుఫాన్లు సంభవించాయి. ఈ కఠిన వాతావరణ పరిస్థితుల కారణంగా తేళ్లు, పాములు భూమిలోని తమ స్థావరాల నుంచి బయటికొచ్చి ప్రజల ఇళ్లల్లో చొరబడ్డాయని తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన స్కార్పియన్ జాతుల్లో ఒకటైన కొవ్వు తోక గల తేళ్ల(ఫ్యాట్ టేయిల్డ్)కు ఈజిప్ట్ ప్రసిద్ధి. కాగా ఈ తీవ్ర వాతావ‌ర‌ణంలో తేలు కాటుకు గాయ‌ప‌డిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అస్వాన్ సమీప గ్రామాల్లోని వైద్య విభాగాలకు యాంటీ-వెనమ్ మందులను అదనపు మొత్తంలో అందించారు. ఈ మేరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు.

అరేబియన్ ఫ్యాట్ టేయిల్డ్ స్కార్పియన్..

కొవ్వు తోక గల ఈ అరేబియన్ తేళ్లు.. ఆఫ్రికా, ఆసియా, ఐరోపాలోని ప్రాచీన జాతికి చెందినవి. ఇవి సాధారణంగా ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియాతో పాటు ఈజిప్ట్‌లోని ఎడారుల్లో కనిపిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇక ఈ తేలు లాటిన్ నామం ‘ఆండ్రోక్టోనస్ క్రాసికాడా’కు ‘మ్యాన్ కిల్లర్’ అని అర్థం కాగా.. దీని స్ట్రింగర్స్(కొండి) న్యూరోటాక్సిన్స్, కార్డియోటాక్సిన్స్‌తో కూడిన శక్తివంతమైన కాక్‌టెయిల్‌తో నిల్వచేయబడి ఉంటాయి. ఎనిమిది కాళ్లు ఉన్నందున ‘అరాక్నిడ్‌’గానూ పరిగణించబడుతుంది.

విష ప్రభావం..

ఈ తేలు విషం బాధితుడి రక్తంలో కలిసిపోయి అంతర్గతంగా రక్తస్రావాన్ని కలిగించి, కంటి చూపును దెబ్బతీస్తుంది. జ్వరం, విపరీతమైన చెమట, వాంతులు, విరేచనాలతో పాటు కండరాలు వణుకుతాయి. గంట సమయం వరకు ఎలాంటి చికిత్స అందకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి గుండె ఆగిపోయి మరణిస్తారు. నాలుగు అంగుళాల పొడవు వరకు పెరిగే ఈ తేళ్లు.. వేటలో కమ్యూనికేషన్ కోసం ఫేరోమోన్స్, వైబ్రేషన్స్‌పై ఆధారపడతాయి. ఇవి ఎక్కువగా ఏకాంత జీవితాన్ని ఇష్టపడతాయి.

Advertisement

Next Story

Most Viewed