అలాంటి అబ్బాయి కోసం 50వేల మంది అమ్మాయిల ఎదురుచూపు

by Anukaran |   ( Updated:2021-04-29 10:11:30.0  )
girls wait for the boy
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే నూరేళ్ల పంట. ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల కుటుంబ చరిత్ర తెలుసుకుంటారు పెద్దలు. అబ్బాయి, అమ్మాయి గుణ గణాలు, రూపు రేఖలు, ఆర్థిక స్థితి, చేసే ఉద్యోగం ఇలా ఎన్నో అంశాలను భేరీజు చేసుకుంటారు తల్లిదండ్రులు. తగిన వరుడు, వధువు దొరికే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. సరిగ్గా ఇదే ఎదురు చూపు చూస్తున్నారు 50 వేలమంది అమ్మాయిలు. తగిన వరుడు కావాలని 30 ఏళ్లు దాటినా రాజీ పడడం లేదు.

ఎక్కడైనా అమ్మాయిలు దొరకక అబ్బాయిలు పెళ్లి కోసం ఎదురు చూస్తుంటారు. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండడం, సరైన జోడీ కాదనే కారణంతో యువకుల్లో 30 ఏళ్లు దాటినా చాలా మందికి వివాహం కాదు. కానీ కశ్మీర్ రాష్ట్రంలో మంచి వరుడు దొరకలేదని యువతులకు వివాహాలు కావడం లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది యువతులు పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయారు. తెహ్రీక్ ఈ ఫలా ఉల్ ముస్లిమీన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

‘మా బంధువులు, మా పక్కింటి వాళ్లు తమ కూతురిని మంచి ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. నేను వాళ్లకన్న తక్కువేం కాదు.. అంతకన్న మంచి వ్యక్తిని, ఉద్యోగికి ఇచ్చి నా కూతురుకు పెళ్లి చేస్తా’ అని చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిల పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇలా సరైన వరుడు కావాలని ఏళ్లకు ఏళ్లు సెర్చింగ్ చేస్తూ కాలాన్ని వృథా చేస్తున్నారు. దీని వల్ల అమ్మాయిల వయసు పెరిగిపోతూ.. 30 ఏళ్లను క్రాస్ చేస్తున్నారు. ఇలా వయసు పెరిగిపోయిన యువతులను పెళ్లి చేసుకోవడానికి యువకులు ముందుకు రావడం లేదు. దీంతో కశ్మీర్ రాష్ట్రంలో 50 వేల మంది యువతులు పెళ్లి కాకుండానే పుట్టింట్లో మిగిలిపోయారని తెహ్రీక్ ఈ ఫలా ఉల్ ముస్లిమీన్ సంస్థ వ్యవస్థాపకుడు అబ్దుల్ రషీద్ నాయక్ పేర్కొన్నారు. ఒక్క శ్రీనగర్ లోనే ఇలా 10 వేల మంది యువతులు ఉన్నట్లు తమ సర్వేలో తేలినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు ఈ తరం కుర్రాళ్లలో అత్యధిక శాతం మంది చదువుకున్న అమ్మాయిలనో, ఏదో ఒక ఉద్యోగం చేసే యువతులనో మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడయిందంటున్నారు. చదువు లేకుంటే అధిక కట్నాలు అడుగుతున్నారని, అంత మొత్తంలో ఇచ్చుకోలేక కూడా పెళ్లిళ్లు జరగడం లేదని తేలిందని ఆయన వివరించారు. ఏదిఏమైనా.. వరుడుకోసం అమ్మాయిలు ఎదురు చూడడం విడ్డూరంగా ఉన్నది. మరీ వేల మంది యువతులు ఆ కారణంతో పెళ్లికి దూరం కావడం విచారకరమే.

Advertisement

Next Story

Most Viewed