- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలిస్తేనే.. రేసులో టీమిండియా
సిడ్నీ: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోల్పోయినా, టీ20 సిరీస్ దక్కించుకుని ఆసిస్‌తో లెక్క సమం చేసింది. టీ20 సిరీస్ నెగ్గామన్న ఉత్సాహంతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బరిలోకి దిగిన భారత జట్టును ఆసిస్ ఊహించని దెబ్బ కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుపై కోహ్లీసేన పైచేయి సాధించినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి పరిస్థితి మొత్తం తలకిందులైంది. భారత బ్యాట్స్‌మెన్‌లు స్వల్ప స్కోరుకే వరుసగా పెవీలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే టీమ్ ఇండియా అత్యంత తక్కువ స్కోరు(36) పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా తొలి టెస్టులో ఆసిస్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రత్యర్థి జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో శనివారం నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే/రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆసిస్ బరిలోకి దిగుతుండగా, ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలోనే భారత జట్టులో పలు మార్పులు చేర్పులు జరిగాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే..
గెలవాల్సిందే
టీమ్ ఇండియా టెస్టు సిరీస్ రేసులో నిలవాలంటే శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోతే ఆసిస్ 2-0తో ఆధిక్యంలో ఉంటుంది. దీంతో ఆ తర్వాత జరిగే రెండు టెస్టుల్లో ఆసిస్ ఏ ఒక్కదాంట్లో గెలిచినా 3-1తో ఆతిథ్య జట్టుకే సిరీస్ దక్కుతుంది. ఇలా కాకుండా రెండో టెస్టు డ్రా అయితే గనుక, సిరీస్ దక్కాలంటే తర్వాత జరిగే రెండు టెస్టుల్లోనూ టీమ్ ఇండియా గెలవాల్సి ఉంటుంది. లేదా ఒకదాంట్లో గెలిచి, ఒకదాన్ని తప్పనిసరిగా డ్రాగా మలచాలి. అప్పుడే సిరీస్ డ్రాగా ముగుస్తుంది. కానీ, రెండో టెస్టు డ్రా అయితే, 3,4వ టెస్టుల్లో ఆసిస్ ఏ ఒక్కదాంట్లో గెలిచినా సిరీస్ వారికే దక్కుతుంది. కాబట్టి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రేసులో నిలవాలంటే టీమ్ ఇండియా తప్పనిసరిగా బాక్సింగ్ డే టెస్టులో పైచేయి సాధించాల్సిందే.
తుది జట్టు ప్రకటన
కోహ్లీ గైర్హాజరీతో అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అతని సారథ్యంలోనే జరిగే రెండో టెస్టుకు సంబంధించిన తుది జట్టును బీసీసీఐ ట్విట్టర్‌లో శుక్రవారం ప్రకటించింది. జట్టులో నలుగురి స్థానాలు భర్తీ అయ్యాయి. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన ఓపెనర్ పృథ్వీ షాను అందరూ ఊహించినట్టుగానే మేనేజ్‌మెంట్ పక్కనబెట్టింది. అతని స్థానాన్ని శుభ్‌మన్ గిల్ భర్తీ చేశాడు. వార్మప్ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గిల్, మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే, తొలి టెస్టులో 17, 9 పరుగులకే పరిమితమైన మయాంక్ అగర్వాల్ తన ఫామ్‌ను అందుకోవాల్సివుంది. ఇద్దరూ మంచి ఆరంభాన్నిస్తే భారత జట్టుకు తిరుగుండదు.
షమీ స్థానంలో సిరాజ్
తొలి మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన భారత పేసర్ మహ్మద్ షమీ స్థానంలో తెలుగు కుర్రాడు మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కింది. అలాగే, మొదటి మ్యాచ్‌లో అటు కీపర్‌గానూ, ఇటు బ్యాట్స్‌మన్‌గానూ ఆకట్టుకోని వృద్ధిమాన్ సాహాకు యాజమాన్యం ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. అయితే, కేఎల్ రాహుల్‌కు మరోసారీ నిరాశే మిగిలింది. అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. టీ20 మ్యాచ్‌లో కంకషన్‌కు గురైన రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ కోటాలో ఎంపికయ్యాడు. మొత్తంగా భారత తుది జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యంగానే కనిపిస్తోంది. జట్టు సమిష్టి ప్రదర్శన చేస్తే భారత్‌దే పైచేయి. మరోవైపు రెండో టెస్టులో ఇద్దరు క్రికెటర్లు తమ టెస్టు అరంగేట్రం చేయనున్నారు. వీరిలో ఒకరు శుభ్‌మన్ గిల్ కాగా, మరొకరు మహ్మద్ సిరాజ్. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఆడిన ఆటగాళ్లే రెండో టెస్టులోనూ కొనసాగనున్నారు.
తుది జట్లు:
టీమ్ ఇండియా
మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, అజింక్య రహానే(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు
మాథ్యూ వేడ్, జాయ్ బర్న్స్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ పైన్(కెప్టెన్, కీపర్), మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లయన్.