తెలంగాణలో లక్షన్నర దాటిన కరోనా కేసులు

by Anukaran |
తెలంగాణలో లక్షన్నర దాటిన కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒకటిన్నర లక్ష మార్కు దాటింది. తాజాగా 2,534 కేసులు నమోదు కాగా ఇందులో హైదరాబాద్ నగరంలోనే 327 ఉన్నాయి. జిల్లాల్లో మాత్రం ఇంకా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా పెద్దగా ఏమీ లేవని, టెస్టింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు, తగినంతమంది సిబ్బంది లేరని గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. హోమ్ ఐసొలేషన్ విధానం కారణంగా వైరస్ వ్యాప్తి పెరిగి కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య ఎక్కువవుతోందంటూ అసెంబ్లీ వేదికగానే సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా 11మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 927కు చేరుకుంది.

ఇంతకాలం హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే అధిక స్థాయిలో కేసులు నమోదవుతుండగా ఇప్పుడు కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వరంగల్ అర్బన్ లాంటి జిల్లాల్లో కూడా వందకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో సైతం వందకు చేరువగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు కరోనా అనుమానితుల నుంచి శాంపిళ్ళు ప్రతీరోజూ సుమారు 60 వేల మందికి పైగా సేకరిస్తున్నప్పటికీ లాబ్‌లలో సిబ్బంది కొరత, సమయాభావం కారణంగా ప్రతీరోజు రెండున్నర వేల, మూడు వేల శాంపిళ్ళ ఫలితాలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32వేలకుపైగా యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉంటే అందులో పాతిక వేలకు పైగా పేషెంట్లు ప్రభుత్వ, హోమ్ ఐసొలేషన్ కేంద్రాల్లోనే ఉంటున్నారు.

Advertisement

Next Story