కొత్తగా 206 మందికి కరోనా పాజిటివ్

by Shamantha N |
కొత్తగా 206 మందికి కరోనా పాజిటివ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు విదేశీ ప్రయాణికుల ద్వారానే ఇది వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ, ఢిల్లీలోని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెలువరించిన తాజా నివేదిక (మార్చి 20, ఉదయం 10.00 గంటలు) మాత్రం 206 మంది శాంపిళ్ళను పరీక్షించినప్పుడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా స్టేజ్-2లో మాత్రమే ఉందని, స్టేజి-3 వరకూ వెళ్ళలేదని రెండు రోజుల క్రితం ప్రకటించింది. కానీ, ఈ రెండ్రోజుల వ్యవధిలో మాత్రం ఊహించని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పాజిటివ్ వ్యక్తుల ద్వారా స్థానికులకు కూడా అది వ్యాపించినట్లు తాజా నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

దేశవ్యాప్తంగా కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ చేయడం లేదా ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకకుండా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నాయి. దీనికితోడు ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో శానిటైజర్ లాంటి చర్యల ద్వారా ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నాయి. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం) ప్రభావం గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు ఐసీఎంఆర్ ఈ నెల 19వ తేదీన వెలువరించిన ప్రకటనలో పేర్కొంది. జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో వ్యాప్తి చెందే అవకాశాలపై నిశితంగా అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపింది. ఒక్కరికి కూడా పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు తమ అధ్యయనంలో వెల్లడి కాలేదని స్పష్టం చేసింది.

కరోనా కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే స్థానికుల్లో వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఐసీఎంఆర్‌ను కేంద్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. గత నెల 29వ తేదీ నుంచి 16 ప్రాంతాలను ఎంపిక చేసుకుని కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేస్తూ ఉంది. ఫ్లూ లక్షణాలు కలిగిన అనుమానితుల నుంచి శాంపిళ్ళను సేకరించి పరిశీలించింది. తీవ్రత పెరిగే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని 51 ప్రాంతాల్లో తన బృందాలను నియమించింది. మార్చి 19వ తేదీ వరకు 856 మంది నుంచి శాంపిళ్ళను సేకరించి ల్యాబొరేటరీలో పరీక్షించింది. కానీ, ఒక్కరికి కూడా పాజిటివ్ నిర్ధారణ కాలేదని, అందరికీ నెగటివ్ రిజల్టులే వచ్చాయని ప్రకటించింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రమాదం ఇంకా రాలేదని స్పష్టం చేసింది.


కానీ, మరుసటి రోజు (మార్చి 20) ఉదయం 10 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో మాత్రం 206 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎంపిక చేసిన 51 ప్రాంతాల నుంచి 13,486 మంది దగ్గరి నుంచి 14,376 శాంపిళ్ళను సేకరించామని, వాటిని పరీక్షించగా ‘సార్స్-కోవ్-2’ (కోవిడ్-19) పాజిటివ్ రిజల్టులు వచ్చాయని అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నిర్ధారణ కాకపోయినా ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా 206 మందికి పాజిటివ్ అని తేలడం గమనార్హం. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో అనే అధ్యయనానికి మాత్రమే పరిమితమై అనుమానితుల నుంచి శాంపిళ్ళను సేకరించి శాస్త్రీయంగా అధ్యయనం జరుపుతున్న ఐసీఎంఆర్ స్టేజ్-3 గురించి మాత్రం ఎలాంటి ఆందోళనా వ్యక్తం చేయలేదు. కరోనా పాజిటివ్ వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండడం ద్వారానే ఈ 206 మందికి పాజిటివ్ లక్షణాలు వచ్చినట్లు ఐసీఎంఆర్ నిర్ధారణకు వచ్చింది.

ఈ నివేదిక అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇకపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుతం ఉన్న ఆంక్షలను ఏ మేరకు కఠినతరం చేయనుందో ఒకటి రెండు రోజుల్లో స్పష్టం కానుంది. ఢిల్లీ మెట్రో రైళ్ళలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకులు స్వచ్ఛందంగా ఒకరి నుంచి మరొకరు కనీసంగా ఒక మీటరు దూరంలో ఉండాలన్న నిబంధన పాటించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిబంధన విధించింది. దాన్ని పాటిస్తున్నప్పటికీ పాజిటివ్ రిజల్టులు వస్తున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఇలాంటి పాజిటివ్ వస్తోంది, ఆ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్న ప్రమాణాలేంటివి.. తదితరాలపై మాత్రం ఐసీఎంఆర్ స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి తీసుకోనున్న చర్యలపై స్పష్టత ఏర్పడుతుంది.

Tags : ICMR, Corona, Positive, Community Transmission, CoViD-19, latest report

Advertisement

Next Story

Most Viewed