ప్రపంచ కప్‌లో పాక్ అనుమానమే..! ఆసియా కప్‌కు హైబ్రిడ్ మోడల్..

by Vinod kumar |
ప్రపంచ కప్‌లో పాక్ అనుమానమే..! ఆసియా కప్‌కు హైబ్రిడ్ మోడల్..
X

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్-2023 వన్డే టోర్నమెంట్‌ను పాకిస్తాన్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకోనుందా..? భారత జట్టు ఆసియా కప్‌ను పాక్‌లో ఆడేందుకు ఇష్టపడకుంటే.. వరల్డ్ కప్‌లో పాక్ జట్టు భారత్‌లో ఎందుకు ఆడాలనే ప్రశ్న తలెత్తనుందా..? పాకిస్తాన్ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రపంచ కప్‌లో పాక్ జట్టు ఆడటం అనుమానమే కలుగుతోంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వరల్డ్ కప్‌కు పాక్ జట్టును పంపించడంపై నిర్ణయం తీసుకునేందుకు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఒక కమిటీని పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇదే సమయంలో ఆసియా కప్‌లో ఆడేందుకు పాక్‌కు వెళ్లడం లేదని భారత్ స్పష్టం చేసింది. భారత జట్టు ఆసియా కప్ కోసం పాక్‌కు వచ్చేందుకు ఇష్టపడనప్పుడు ప్రపంచ కప్‌లో పాక్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఎందుకు నిర్వహించకూడదు..? అని పాక్ క్రీడా మంత్రి ఎహ్సాన్ మజారీ ప్రశ్నించారు. మరోవైపు ఆసియా కప్‌కు సంబంధించి హైబ్రిడ్ మోడల్‌ను ధృవీకరించడానికి ఐసీసీ బోర్డు గురువారం సమావేశం నిర్వహించనుంది. ఈ తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ జకా అష్రఫ్ డర్బన్‌లో సమావేశమయ్యారు.

ఆసియా కప్‌కు హైబ్రిడ్ మోడల్..

పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో ఆసియా కప్‌కు హైబ్రిడ్ మోడల్‌ను పీసీబీ నాటి చీఫ్ నజామ్ సేథీ ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదించిన ఆ మోడల్ ప్రకారం పాకిస్తాన్‌లో నాలుగు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత శ్రీలంకలో 9 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అందులో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. ఒకవేళ రెండు జట్లూ ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు. ఈ హైబ్రిడ్ మోడల్‌ను ప్రస్తుత పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ వ్యతిరేకించారు. అయితే.. ఈ మోడల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే ఆమోదించినందున షెడ్యూల్‌లో మార్పులు ఉండబోవని క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా.. ప్రపంచ కప్‌లో పాక్ జట్టు ఆడే వేదికలను పరిశీలించేందుకు భారత్‌కు పీసీబీ ఓ బృందాన్ని పంపిస్తోంది. దీన్ని బట్టి పాక్ జట్టును భారత్‌కు పంపడానికి పాక్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed