ICC World Cup 2023: 'మమ్మల్ని ఇలా అవమానిస్తారా?'.. భారత్​ వీసా ఇవ్వకపోవడంపై ఐసీసీకి పాక్​ లేఖ

by Vinod kumar |
ICC World Cup 2023: మమ్మల్ని ఇలా అవమానిస్తారా?.. భారత్​ వీసా ఇవ్వకపోవడంపై ఐసీసీకి పాక్​ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: వీసా సమస్యల కారణంగా పాకిస్థాన్​ క్రికెట్ జట్టు వరల్డ్​ కప్​ 2023 కోసం భారత్‌కు రావడం ఆలస్యమవుతుండటంపై పాక్​ క్రికెట్ బోర్డు- పీసీబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐసీసీ సీఈఓ జియోఫ్​ అల్లార్డిస్‌కు ఓ లేఖ రాసింది. అందులో తమ జట్టు ప్లేయర్లకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, అభిమానులకు వీసా మంజూరు విషయంలో తాము వ్యక్తం చేసిన ఆందోళలను మూడేళ్లుగా పరిష్కరించలేదని తెలిపింది. పాకిస్థాన్‌తో ఇలాంటి అవమానకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెప్పింది.

ఇదే విషయాన్ని పీసీబీ ప్రతినిధి ఉమర్ ఫరూక్​ పునరుద్ఘాటించారు. వరల్డ్​ కప్ ​2023 కోసం సెక్యూరిటీ క్లియరెన్స్, భారత్​వీసా పొందడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. గత వారం నుంచి 24 గంటల్లో వీసాలు మంజూరువుతాయని అంటున్నా.. ఇంకా వేచి చూడాల్సి వస్తోందని తెలిపారి. భారత్​హోం శాఖ ఇంకా ఎన్‌ఓసీ మంజూరు చేయలేదని వెల్లడించారు. ప్రపంచ కప్​లాంటి మెగా టోర్నమెంట్‌కు ముందు పాకిస్థాన్​జట్టుకు వీసా విషయంలో అనిశ్చితి నెలకొనడం నిరాశ కలిగించే విషయమని అన్నారు. తాము రీ-షెడ్యూల్​రూపొందించాలని.. వీసా జారీకి అనుగుణంగా విమానాలు బుక్​ చేసుకోవాలని ఉమర్​ ఫరూక్​ ఆందోళన వ్యక్తం చేశారు.

షెడ్యూల్ ​ప్రకారం.. పాకిస్థాన్​ జట్టు సెప్టెంబర్​27న హైదరాబద్‌కు చేరుకోవాలి. అనంతరం సెప్టెంబర్ 29న హైదరాబాద్​ వేదికగా న్యూజిలాండ్‌తో​ వార్మప్ ​మ్యాచ్​ ఆడాలి. దానికి ముందు దుబాయ్‌లో రెండు రోజుల బాండింగ్​ సెషన్‌ను పూర్తి చేసుకోవాలి. అయితే పాక్​ టీమ్‌కు ఇంకా భారత వీసాలు మంజూరు కాకపోవడం వల్ల.. దుబాయ్‌లో జరగాల్సిన బాండింగ్ సెషన్​రద్దు అయింది. అయితే సోమవారం పాక్​ వరల్డ్ కప్ జట్టుకు వీసా మంజూరు చేసే అవకాశముంది. అదే జరిగితే సెప్టెంబర్​ 27న తెల్లవారుజామున పాక్​ టీమ్​హైదరాబాద్‌కు చేరుకుంటుంది. కాగా.. పాకిస్థాన్​ వీసా దరఖాస్తులకు హోం, విదేశీ వ్యవహారాలు, క్రీడా శాఖ అనుమతి ఇవ్వాల్సిఉంటుంది. పాకిస్థాన్ చివరి సారిగా 2016లో టీ20 వరల్డ్​కప్​ కోసం ఇండియాకు వచ్చింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థుల వల్ల ద్వైపాక్షిక సిరీస్‌ల జోలికి వెళ్లకుండా.. ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్​ల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ వరల్డ్​ కప్‌లో అక్టోబర్​14న అహ్మదాబాద్​వేదికగా మరో సారి భారత్-పాక్​ తలపడనున్నాయి.

Advertisement

Next Story