ODI World Cup 2023: టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే జట్టులో అతనుండాలి.. Mohammad Kaif

by Vinod kumar |
ODI World Cup 2023: టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే జట్టులో అతనుండాలి.. Mohammad Kaif
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలవాలంటే జట్టులో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా లేకుంటే జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా మారుతుందని తెలిపాడు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా కాంబినేషన్ గురించి కైఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో భారత్ అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే ఒకటే మార్గం. గాయపడి వచ్చిన ఆటగాళ్లంతా సత్తా చాటాలి. జస్‌ప్రీత్ బుమ్రా ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వరల్డ్‌ కప్‌ నాటికి అతను పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా తయారవుతోంది. ఒకవేళ బుమ్రా ఈసారి మెగా టోర్నీలోనూ ఆడకపోతే భారత్‌కు చాలా నష్టం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ ప్రయోగాలు చేసింది. వీటిపై మాట్లాడటం చాలా తొందరవుతోంది. ఆసియా కప్‌ నుంచి భారత్ తీసుకునే నిర్ణయాలపై స్పందిస్తా. మినీ టోర్నీకి 15 మంది ఆటగాళ్లను ఎలా ఎంపిక చేస్తారనేది చాలా కీలకం. ఎందుకంటే ఆసియా కప్‌లో ఆడే తుది జట్టు ప్రపంచ కప్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విండీస్‌తో మూడు వన్డేల్లోనూ హాఫ్‌ సెంచరీలు సాధించిన ఇషాన్‌ కిషన్‌తోపాటు సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లో అందరూ 15 మంది జట్టులో ఉండకపోవచ్చు. ఒకవేళ కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌ వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేసుకొనే అవకాశం లేకపోలేదు. భారత్‌ తప్పకుండా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. సెమీస్‌, ఫైనల్‌కు చేరుకొని కప్‌ను అందుకోవాలంటే మాత్రం మరింత కష్టపడాలి'' అని కైఫ్‌ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed