ICC World Cup 2023 Qualifiers: జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్‌.. వన్డే వరల్డ్ కప్‌ నుండి ఔట్!

by Vinod kumar |
ICC World Cup 2023 Qualifiers: జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్‌.. వన్డే వరల్డ్ కప్‌ నుండి ఔట్!
X

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో గ్రూప్‌ దశలో వరుస విజయాలతో చెలరేగిన జింబాబ్వే జట్టును దురదృష్టం వెంటాడింది. సీన్‌ విలియమ్స్‌ వరుస సెంచరీలకు తోడుగా సికందర్‌ రజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేస్తుండడంతో జింబాబ్వే ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే సూపర్‌ సిక్స్‌ దశకు వచ్చేసరికి చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంతో జింబాబ్వే అవమాన భారంతో వరల్డ్‌కప్‌ అర్హత రేసు నుంచి నిష్క్రమించింది.

సూపర్‌ సిక్స్‌లో వరుస రెండు ఓటములు జింబాబ్వే కొంపముంచితే.. తొలి మ్యాచ్‌లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్‌ రన్‌రేట్‌తో ఉన్న స్కాట్లాండ్‌ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే చాన్స్‌ ఉంది. స్కాట్లాండ్‌ తమ చివరి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ గెలిస్తే నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది.

స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్‌ సిక్స్‌ ఆరో మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్‌ అయింది. రియాన్‌ బర్ల్‌ 84 బంతుల్లో 83 పరుగులు వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది. మెస్లీ మెద్వెర్‌ 40, సికందర్‌ రజా 34 పరుగులు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ సోల్‌ 3 వికెట్లు తీయగా, బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ 2, సఫ్యాన్‌ షరీఫ్‌, మార్క్‌ వాట్‌, క్రిస్‌ గ్రీవ్స్‌ తలా 1 వికెట్‌ తీశారు. అంతకముందు మొడట బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్‌ లీస్క్‌ 48, మాథ్యూ క్రాస్‌ 38, బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ 34, మున్సే 31, మార్క్‌ వాట్‌ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్‌ విలియమ్స్‌ 3 వికెట్లు తీయగా.. చటారా 2, నగరవా ఒక వికెట్‌ పడగొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed