ICC World Cup 2023: సగం మ్యాచ్‌లు పూర్తి.. సెమీఫైనల్‌కు వచ్చేది ఎవరు?

by Vinod kumar |
ICC World Cup 2023: సగం మ్యాచ్‌లు పూర్తి.. సెమీఫైనల్‌కు వచ్చేది ఎవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా జరుగుతున్న ICC World Cup 2023లో చెన్నై వేదికగా సౌతాఫ్రికా- బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీలో సగం మ్యాచ్‌లు ముగిశాయి. సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లతో కలిపి ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కాగా ఇప్పటివరకు జరిగిన ఈ టోర్నీ మొదటి సగం మ్యాచ్‌లో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆఫ్గానిస్తాన్‌, నెదర్లాండ్స్‌ వంటి పసికూనలు వరల్డ్‌క్లాస్‌ జట్లను మట్టికరిపించాయి. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ వంటి మేటి జట్లను ఆఫ్గానిస్తాన్‌ చిత్తుచేయగా.. సౌతాఫ్రికాను నెదర్లాండ్స్‌ ఓడించింది.

సెమీఫైనల్స్‌కు చేరేది ఎవరు..?

ICC World Cup 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా.. ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక పాయింట్ల పట్టికలో టీమిండియా తర్వాత సౌతాఫ్రికా ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా.. నాలుగింట విజయం సాధించింది. ఇక మూడో స్ధానంలో కివీస్‌ ఉంది. కివీస్‌ కూడా టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతోంది. భారత్‌తో మినహా మిగితా మ్యాచ్‌లన్నింటిలోనూ కివీస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక కివీస్‌ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా ఉంది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. టాప్‌-4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌ అర్హత సాధిస్తాయి. మరో రెండు మూడు రోజుల్లో సెమీఫైనల్‌ చేరే జట్లపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది. నవంబర్‌ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్‌.. నవంబర్‌ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రెండో సెమీఫైనల్‌ జరగనుంది. ఇక ఫైనల్‌ నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed